మేడారం జాతరలో వారిద్దరూ బాధ్యతలు నిర్వర్తించడం వెనుక..!
By అంజి Published on 10 Feb 2020 2:52 PM ISTవరంగల్: రెండు సంవత్సరాల క్రితం 29 సంవత్సరాల రూపేష్ చెన్నూరి అనే వ్యక్తి మేడారంలోని సమ్మక్క-సారక్క జాతరకు వచ్చాడు. అతడు తన కుటుంబంతో కలిసి చాలా సార్లు మేడారం జాతరకు వచ్చాడు. వరంగల్ కు చెందిన అతను జాతరలో మొక్కులు తీర్చుకోడానికి గతంలో ఆటో రిక్షాలలోనూ, ఎద్దుల బండిలోనూ వచ్చాడు.
రెండేళ్ల తర్వాత కూడా రూపేష్ మేడారం జాతరకు వచ్చాడు. ఈసారి భక్తుడిగా కాదు.. పబ్లిక్ సర్వెంట్ గా..! పోలీసు ఆఫీసర్ గా మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాడు రూపేష్. సివిల్స్ ర్యాంక్ కొట్టాలని భావించిన రూపేష్ అనుకున్నది సాధించాడు. యూపీఎస్సి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించిన రూపేష్ త్వరలో ఐపీఎస్ ఆఫీసర్ కాబోతున్నాడు. 2017 బ్యాచ్ కు చెందిన రూపేష్ రామగుండం కమిషనరేట్ లో ట్రైనీగా పనిచేస్తున్నాడు. ఒకప్పుడు భక్తుడిగా వచ్చిన తాను ఇప్పుడు బాధ్యతలు నిర్వర్తించడంపై రూపేష్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
ఒకప్పుడు తాము దర్శనానికి కొన్ని గంటల పాటూ క్యూ లైన్ లో ఎదురుచూశామని.. ఇప్పుడు తాను గద్దె దగ్గర ఇన్ ఛార్జ్ గా ఉన్నానని రూపేష్ చెప్పుకొచ్చాడు. ఐపీఎస్ కు రూపేష్ సెలెక్ట్ అవ్వకముందు వరకూ అతడి తండ్రి ఆటో రిక్షా నడిపేవారట.. అలాగే అతని తల్లి బీడీలు చుట్టే పని చేసేవారట.. వారి సొంత ఊరు హసన్ పర్తీ. ప్రొఫెషనల్ గా మేడారం జాతర తనకు ఛాలెంజింగ్ గా అనిపించిందని రూపేష్ చెబుతున్నారు. నేర్చుకోడానికి కూడా ఎన్నో విషయాలు ఉన్నాయని.. ఇంత తక్కువ సమయంలో ఎక్కువమంది భక్తులు అక్కడకు వచ్చారని.. వారందరినీ కంట్రోల్ చేయడం అన్నది కూడా పెద్ద విషయమేనని.. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోడానికి తాము 24 గంటలూ పనిచేయాల్సి వస్తుందని రూపేష్ చెప్పాడు. సీనియర్ అధికారుల సూచనలు కూడా కెరీర్ కు బాగా హెల్ప్ అవుతాయని రూపేష్ అన్నాడు.
రూపేష్ లాగే వరంగల్ కు చెందిన బి.రోహిత్ అనే 28 సంవత్సరాల ఐపీఎస్ ట్రైనీది కూడా ఓ కొత్త అనుభవం. రోహిత్ తండ్రి అశోక్ రాజు వరంగల్ కమిషనరేట్ లో సబ్-ఇన్స్పెక్టర్ గా పనిచేసే వారు. తన తండ్రి సహోద్యోగులను అంకుల్-అంకుల్ అని పిలిచేవాన్నని.. ఇప్పుడు వారందరూ తనను 'సార్' అంటూ సంబోధిస్తున్నారని.. ఇది తనకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తూ ఉన్నా.. తాను ఏమీ చేయలేని పరిస్థితి అని చెప్పాడు రోహిత్. ఇది తన జీవితంలో ఊహించని ఘటన అని.. ప్రస్తుతం తన తండ్రితో పనిచేసిన వారితోనూ, ఆయన సీనియర్ ఆఫీసర్లతో కలిసి మేడారం జాతరలో పనిచేశానని.. చాలా మంది గుర్తించి తనను గుర్తుపట్టారని.. డ్యూటీ ముగిసిన తర్వాత వారందరినీ తనకు కేటాయించిన కేబిన్ దగ్గర కలవడం ఆనందంగా ఉందని అన్నాడు. రోహిత్ ను విఐపీ-వీవీఐపీ గేట్స్ దగ్గర ఇన్ ఛార్జ్ గా నియమించారు. తన సొంత ఊరిలో బాధ్యతలు నిర్వర్తించడం చాలా గర్వంగా ఉందని అన్నాడు రోహిత్.