తెలంగాణ కుంభమేళాకు సర్వం సిద్ధం.. మహానగరాన్ని తలపిస్తోన్న మేడారం
By అంజి Published on 4 Feb 2020 5:13 AM GMT
ములుగు: మేడారంలో జరిగే సమ్మక్క సారక్క జాతరకు సర్వం సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగైన సమ్మక్క సారక్క జాతర రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే మేడారం పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారిపోయాయి. జాతర ప్రారంభంకాకముందే అడవి తల్లులను 40 లక్షల మందికి పైగా దర్శనం చేసుకున్నారు. రెండు సంవత్సరాల కోకసారి జరిగే ఈ జాతరకు దాదాపు కోటి మంది భక్తులు వస్తారని అంచనా.
ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు జరిగే ఈ జాతర కోసం ఇప్పటికే వివిధ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. బుధవారం రోజున మహాజాతర ప్రారంభం కానుంది. మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను పూజారులు తొడ్కొని గద్దెపై ప్రతిష్టిస్తారు. కొండాయి నుంచి గోవిందరాజులను తీసుకొస్తారు. గురువారం రోజున సమ్మక్కను చిలుకల గుట్ట మీద నుంచి తీసుకొచ్చి గద్దెలపై కూర్చోబెడతారు. కాగా ఇవాళ కన్నెపల్లె నుంచి జంపన్నను పూజారులు గద్దెపై ప్రతిష్టిస్తారు. శుక్రవారం నాడు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్నలు గద్దెలపై నుంచి భక్తులకు దర్శనమిస్తారు.
భారతదేశంలో జరిగే కుంభమేళా తర్వాత ఈ జాతరకే ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. ఆసియాలోనే అతిపెద్ద జాతరగా కూడా మేడారానికి గుర్తింపు ఉంది. మేడారం జాతర గిరిజనుల సంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. దాదాపు 900 ఏళ్ల చరిత్ర మేడారం సమ్మక సారక్క జాతరకు ఉంది. జాతర జరిగే నాలుగు రోజుల్లో 60 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దాదాపు 1500 ఎకరాల్లో వాహనాల పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. వేల సంఖ్యలో గుడారాలు, దుకాణాలతో అడవి ప్రాంతం ఇప్పుడు మహానగరాన్ని తలపిస్తోంది.
ఏర్పాట్లు పూర్తి..
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 600 మంది, రాజమహేంద్రవరం నుంచి 3,500 మంది పారిశుద్ధ్య కార్మికులు ఇప్పటికే మేడారం చేరుకున్నారు. జంపన్న వాగు వద్ద నాలుగు కిలోమీటర్ల పొడవున స్నానపు ఘట్టాల దగ్గర 5 వేల షవర్లను ఏర్పాటు చేశారు. బట్టలు మార్చుకునేందుకు 1400 కంపార్ట్‌మెంట్లు ఏర్పాటుచేయగా, 8,400 తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. కాగా ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను ప్లాస్టిక్ రహిత జాతరగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్‌పై అవగాహన కల్పిస్తూ ఓ భారీ ప్లాస్టిక్ స్టాచ్యూన్‌నే మేడారం ద్వారా ఎదుట ఏర్పాటు చేశారు.
జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన వెంటనే తెలుసుకోవడానికి 300 సీసీ కెమెరాలతో పాటు ఎనిమిది డ్రోన్ కెమెర్లాను ఏర్పాటు చేశారు. మొత్తంగా అమ్మవార్ల గద్దెల సమీపంలో పోలీస్‌కంట్రోల్ రూమ్, ఐటీడీఏ క్యాంప్ కార్యాలయం, ప్రస్రాలో, గట్టమ్మ ఆలయం వద్ద కలిపి నాలుగు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.
ప్రత్యేక సర్వీసులు..
కాగా మేడారం జాతరకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్ సేవలు ప్రారంభమయ్యాయి. భక్తుల సౌకర్యార్థం తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ సేవలను బేగంపేట ఎయిర్‌పోర్టులో ఆదివారం నాడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. టూరిజం ప్యాకేజీలో భాగంగా.. బేగంపేట ఎయిర్ పోర్టు నుండి మేడారం, మేడారం నుండి బేగంపేట ఎయిర్ పోర్టు వరకు హెలికాఫ్టర్ సర్వీసులను నిర్వహిస్తున్నామన్నారు.
హైదరాబాద్, వరంగల్, పరకాల, కరీంనగర్‌తో పాటు పలు పట్టణాల నుంచి మేడారానికి తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతోంది. మేడారంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం 5 వేల సిబ్బంది పని చేయనున్నారు.
తెలంగాణ కుంభమేళా సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఫిబ్రవరి 4 నుంచి 8 వరకూ 20 ప్యాసింజర్ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించిన ఓ అధికారి తెలిపారు. పది రైళ్లు సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి వరంగల్ వరకు, మరో పది రైళ్లు సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు నడవున్నాయి.