మేడారంలో పేలుడు పదర్థాలు.. పర్యాటక.. పోలీసు శాఖల వార్..!
By అంజి Published on 29 Jan 2020 10:25 AM ISTజయశంకర్ భూపాలపల్లి: మేడారంలో జరిగే సమ్మక్క సారక్క జాతర.. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. భారతదేశంలో జరిగే కుంభమేళా తర్వాత ఈ జాతరకే ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. ఆసియాలోనే అతిపెద్ద జాతరగా కూడా మేడారానికి గుర్తింపు ఉంది. రెండు సంవత్సరాల కోకసారి జరిగే ఈ జాతరకు దాదాపు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు జరిగే ఈ జాతర కోసం ఇప్పటికే వివిధ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు. మేడారం జాతర గిరిజనుల సంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. దాదాపు 900 ఏళ్ల చరిత్ర మేడారం సమ్మక సారక్క జాతరకు ఉంది. జాతర సమయంలో ప్రతి రెండేళ్లకొకసారి భక్తుల సంఖ్య పెరుగుతు వస్తోంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
రాష్ట్ర పర్యాటక శాఖ భక్తుల అవసరాల కోసం ప్రత్యేక కాటేజీలు నిర్మించింది. ఇప్పుడవి మాకంటే, మాకంటూ వివిధ శాఖల అధికారులు ఫైట్ చేసుకుంటున్నారు. భక్తుల భద్రత కోసం పోలీసు బలగాలు అక్కడ స్పెషల్ డ్యూటీలు చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో కాటేజీల్లో బాంబులు ఉన్నాయంటూ కొత్త ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అలాగే అధికారులు తమకు కాటేజీలు కేటాయించలేదని వాటికి తాళాలు వేశారు. పోలీసులు, పర్యాటక శాఖల మధ్య ఫైట్ జరుగుతుండగానే నేనేమి తక్కువ కాదన్నంటూ రెవెన్యూశాఖ మధ్యలోకి వచ్చింది. కాటేజీలన్నీ తమకు అప్పగించాలని రెవెన్యూశాఖ డిమాండ్ ఒకటి.
భక్తుల సౌకర్యాల కోసం ఏర్పాటు చేసిన కాటేజీలను.. భక్తులకు ఇవ్వకుండా వివిధ శాఖల్లో వార్ జరుగుతోంది. కాటేజీలను ఎలా తమ చేజిక్కించుకోవాలని చూస్తున్న వివిధ శాఖల అధికారుల మధ్య పూర్తిగా సమన్వయ లోపం కనిపిస్తోంది. మేడారం జాతర నేపథ్యంలో ప్రభుత్వం యంత్రాంగం ఇక్కడే మకాం వేయనుంది. ఈ క్రమంలోనే తమ శాఖకు చెందిన ఉన్నతాధికారులకు అన్ని సౌకర్యాలు ఉండేందుకు ఆయ శాఖ అధికారులు చొరవ చూపుతున్నారు. భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కోట్లాది రూపాయలతో మేడారంలో హరిత హోటల్‌ను నిర్మించింది. దానికి తోడుగా వివిధ కాటేజీలను సైతం ఏర్పాటు చేసింది. ఇటీవలే ఈ హరిత హోటల్‌ను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్‌గౌడ్‌లు ప్రారంభించారు. ఆ తర్వాత ఆడపా దడపా కొందరు కాటేజీలు బుక్ చేసుకున్నారు. అయితే వారు కాటేజీల్లో ఉండగానే పోలీసులు వచ్చి వారిని కాటేజీలు ఖాళీ చేయించారని పర్యాటక శాఖ అధికారులు అంటున్నారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కదా.. అందుకే..
భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇచ్చింది. కానీ ఇప్పుడు అక్కడి పరిస్థితులు అందుకు విభిన్నంగా మారాయి. కాటేజీ గేట్లకు పోలీసులు తాళం వేస్తుండగా.. అక్కడే ఉన్న సెక్యూరీటీ గార్డు పోలీసులను ప్రశ్నించాడట. అందుకు పోలీసులు సమాధానం చెబుతూ.. కాటేజీల్లో బాంబులు ఉన్నాయని సమాచారం వచ్చిందని, అందుకే సీజ్ చేస్తున్నామని తెలిపారని.. మాకు తెలిసిందని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. దీనిపై పోలీసు అధికారులకు పర్యాటక శాఖ ఫోన్ చేసి ప్రశ్నించారట. మీకు తెలిసిందే.. కదా ఈ ప్రాంతం మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమని, అందుకే మా జాగ్రత్తలో ఉన్నామని పోలీసు అధికారులు జవాబిచ్చారని పర్యాటక శాఖ అధికారులు అంటున్నారు.
అయితే అక్కడి కాటేజీల్లో పేలుడు పదర్థాలు ఉన్నాయనేది పూర్తిగా అబ్దమని పర్యాటక శాఖ అధికారులు అంటున్నారు. కనీసం 15 కాటేజీలు, రెండు సూట్‌లు ఇవ్వాలని పోలీసుల శాఖ అడిగిందని, అందుకు తాము నిరాకరించడంతో బాంబులు ఉన్నాయని కొంత అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన వివిధ శాఖల అధికారులే ఇలా సమన్వయ లోపంతో ఉండడమేంటని అక్కడున్న కొందరు అనుకుంటున్నారు. మరీ ఇందులో వాస్తవం ఎంతో ఉందో తెలియాల్సి ఉంది.