సోషల్‌ మీడియాకు అడిక్ట్‌ అవ్వని అమ్మాయి కావాలి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Oct 2020 11:03 AM GMT
సోషల్‌ మీడియాకు అడిక్ట్‌ అవ్వని అమ్మాయి కావాలి..!

ఓ వ్యక్తి పెళ్లి కూతురును వెతికే క్ర‌మంలో చేసిన‌ ప్రకటన ప్రస్తుతం సోష‌ల్‌మీడియాలో తెగ వైరలవుతోంది. అతడి ప్ర‌క‌ట‌న‌‌ చూసిన వారంతా ‘నీకు ఈ జన్మలో పెళ్లి కష్ట‌మే’ అని అంటున్నారు. పెళ్లి కానంత‌గా వింత కోరిక ఏం కోరాడ‌నుకుంటున్నారా.. ఏం లేదు అత‌నికి సోషల్‌ మీడియాకు అడిక్ట్‌ అవ్వని అమ్మాయి కావాల‌ని కోరాడు. దీంతో నెటిజన్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

ఈ విష‌యాన్ని నితిన్‌ సాంగ్వాన్‌ అనే ఐఏఎస్‌ అధికారి త‌న ట్విట‌ర్ ఖాతాలో పోస్టు చేశారు. పెళ్లి సంబంధాలు వెతికే ప్ర‌క్రియలో మార్పులు వ‌స్తున్నాయని పేపర్‌లో వచ్చిన ఓ యాడ్‌ని ఆయ‌న‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. అత‌ని ప్ర‌క‌ట‌న‌లో.. చటర్జీ.. పశ్చిమ బెంగాల్‌ కమర్పూర్ చెందిన వ్య‌క్తి.. వ‌య‌స్సు 37, ఎత్తు 5.‌7. వృత్తి యోగా ప్రాక్టీషనర్, హైకోర్టులో న్యాయవాది, పరిశోధకుడు. అందంగా ఉంటాను. ఎటువంటి దురలవాట్లు లేవు. ఇళ్లు, కారు ఉన్నాయి. తల్లిదండ్రులు ఉన్నారు. కమర్పుకుర్‌లో మరో ఇల్లు కూడా ఉంది. కట్నం అవ‌స‌రం లేదు అని త‌న గురించి చెప్పుకున్నాడు వ‌రుడు. అలాగే.. అందమైన, పొడవైన, సన్నని వధువు కావాలని.. ఆమె సోషల్ మీడియాకు బానిస అయ్యి ఉండ‌కూడదు అంటూ ప్రకటన ఇచ్చాడు.

ప్రస్తుతం ఈ పోస్టు తెగ వైరలవుతోంది. కొందరు నీకు ఇక ఈ జన్మలో పెళ్లి కాదని, నీకు పెళ్లి అవ్వడం.. నేను ప్రధాని కావడం రెండు ఒకటే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక కొంత‌మంది ఇదేం వివక్ష.. అమ్మాయిల‌కు సోషల్ మీడియాలో ఉండే స్వేచ్ఛ కూడా లేదా అని చటర్జీ పోస్టుపై మండిపడుతున్నారు.



Next Story