చికాగోలో లూఠీలు.. స్టోర్లలోకి దూసుకెళ్లారు.. అక్కడున్న వాటిని దోచుకుని వెళ్లిపోయారు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 Aug 2020 9:03 AM GMTచికాగో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసుల మీదకు దూసుకుని వచ్చిన దుండగులు వారిపై దాడి చేశారు.. దీంతో పోలీసులు కూడా కాల్పులు జరిపారు. 100 మందిని పైగా అరెస్ట్ చేశారు. సోమవారం నాడు ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఉన్న స్టోర్స్ లోకి దూసుకుని వెళ్లిన దుండగులు అన్నిటినీ దోచుకుని వెళ్లిపోయారు. అద్దాలను ధ్వంసం చేశారు.
పోలీసు సూపరింటెండెంట్ డేవిడ్ బ్రౌన్ ఈ ఘటనపై స్పందించారు. ఈ ఘటన నేర ప్రవృత్తి కలిగిన వారు చేసిన పని అని అన్నారు. నిరసనలు చేయాలని ఈ పని చేయలేదని.. లూఠీలు చేయాలన్న ఉదేశ్యంతోనే అందరూ రోడ్ల మీదకు వచ్చారని బ్రౌన్ అన్నారు. 13 మందికి పైగా అధికారులు గాయపడ్డారు. దీంతో పోలీసులు గన్ ఫైర్ చేయాలని భావించారు. సెక్యూరిటీ గార్డ్, ఓ సాధారణ వ్యక్తి కాల్పుల్లో గాయపడ్డారు.
ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చేతికి దొరికిన వస్తువులను వీరంతా దోచుకుని వెళ్ళిపోవడం చూడొచ్చు. మిచిగాన్ అవెన్యూ ప్రాంతంలో స్టోర్స్ కు చెందిన అద్దాలను పగులగొట్టారు.
ఓ వ్యక్తి గన్ తో కనిపించడంతో పోలీసులు అతడిని కాల్చారని బ్రౌన్ తెలిపాడు. ఆ తర్వాతనే పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. నిరసన తెలపడానికి వారు రాలేదని.. లూఠీలు చేయాలనే ఉద్దేశ్యంతోనే వారు రోడ్ల మీదకు వచ్చినట్లు చెబుతూ ఉన్నారు. పోలీసులు కాల్చిన 20 సంవత్సరాల వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పోలీసులు 20 సంవత్సరాల వ్యక్తిపై కాల్పులు జరిపారని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు రాగానే పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.
400 మంది పోలీసులను ఆ ప్రాంతంలో మోహరించారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తారని అనుకుంటే నిరసనకారులు దాడులకు దిగారు. దీంతో పోలీసులు వారిపై కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే 100 మందిని అదుపులోకి తీసుకోగా.. వీడియోల ఆధారంగా లూఠీలకు పాల్పడ్డ వారిని గుర్తిస్తూ ఉన్నారు.