మారుతీరావు మరణం వెనుక అనేక కోణాలు..

By అంజి  Published on  8 March 2020 5:32 AM GMT
మారుతీరావు మరణం వెనుక అనేక కోణాలు..

ముఖ్యాంశాలు

  • కూతరిపై బెంగే ఆత్మహత్యకు కారణమా?
  • మొండితనం, మూర్ఖత్వమే ప్రాణం తీసిందా
  • సూసైడ్‌ నోట్‌లో ఏమని ఉంది

కూతరు అమృత భర్త ప్రణయ్‌ హత్య కేసు నిందితుడుగా ఉన్న మారుతీరావు ఆత్మహత్య కలకలం సృష్టించింది. శనివారం రాత్రి హైదరాబాద్‌ చింతలగూడ బస్తీలోని ఆర్యవైశ్య భవన్‌లో నింద్రించిన మారుతీరావు.. ఆదివారం ఉదయం చూసేసరికి విషంతాగి ఆత్మహత్య చేసుకొని కనిపించాడు. దీంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యా..? లేక సాధారణ మరణమా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులు మాత్రం పోలీసుల వేధింపుల వల్లే మారతీరావు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. కాగా మారతీరావు ఆత్మహత్య వెనుక అనేక కోణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మారుతీరావు పంతం, మూర్ఖత్వమే ఆయన ప్రాణాన్ని బలితీసుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రణయ్‌ కుమార్‌ దారుణ హత్య..

మారుతీరావు స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ. కూతురు అమృత. వీరిది ఉన్నత కుటుంబం. మారుతీరావు కుమార్తె అమృత అదే ప్రాంతానికి చెందిన ప్రణయ్‌ను ప్రేమవివాహం చేసుకుంది. ప్రయణ్‌, అమృత కులాలు వేరువేరు కావటంతో మరుతీరావు వీరి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా అమృత ప్రయణ్‌ను పెళ్లిచేసుకుని తన ఇంటినుంచి ప్రణయ్‌ ఇంటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మారుతీరావు ప్రణయ్‌పై కక్షపెంచుకున్నాడు. పలుమార్లు అమృతను ప్రణయ్‌ను వదిలి ఇంటికిరావాలని రాయబారాలు నడిపారు. దీంతో తన తండ్రి మారుతీరావు నుంచి తమకు ప్రాణహాని ఉందని అమృత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో 2018 సెప్టెంబర్‌ 14న మిర్యాలగూడలో పెరుమాళ్‌ ప్రణయ్‌ కుమార్‌ దారుణ హత్యకు గురయ్యాడు. భార్య అమృతతో కలిసి ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో నరికి చంపారు. హత్యకు సంబంధించి మారుతీరావు సహా ఎనిమిదిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మారుతీరావు వరంగల్‌ సెంట్రల్‌ జైలులో ఏడు నెలలు ఉన్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో జైలు నుంచి బెయిల్‌పై విడుదలై వచ్చాయి.

మారుతీరావు జైలు నుంచి వచ్చిన తరువాత కూడా కూతురిని తన వద్దకు రావాలని పలువురితో రాయబారాలు పంపించినట్లు, అమృత ససేమీరా అన్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అదే సమయంలో అమృత మగబిడ్డకు జన్మనిచ్చింది. కుమారుడికి ప్రయణ్‌ అని పేరు పెట్టారు. కూతురు ఎంత చెప్పినా తన ఇంటికి రావటంతో మారుతీరావు బంధువుల వద్ద చెప్పి తీవ్ర మనోవేదనకు గురైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఇదిలాఉంటే గత వారంరోజుల క్రితం మిర్యాలగూడలోని మారుతీరావు షెడ్డులో ఓ కుళ్లిన శవం కనిపించింది. షెడ్డునుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి ఒంటిపై బ్లూ కలర్‌ షర్ట్, జీన్స్‌ ప్యాంట్‌, చేతికి వాచ్‌ ఉన్నాయి. ముఖం పూర్తిగా కుళ్లిపోయి ఉంది. మారుతీరావు షెడ్డులో ఈ ఘటన జరగడంతో మారుతీరావే హత్య చేయించాడా..? ఇంకా ఎవరైనా హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మారుతీరావు ఆత్మహత్య చేసుకోవటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మారుతీరావుకు కూతురంటే అమిత ప్రమే అని ఆమె వదిలి వెళ్లినదగ్గర నుంచి ఆయనకు కష్టాలు వెంటాడుతున్నాయని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. అమృత ప్రణయ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు మారుతీరావు ప్రణయ్‌ వేరే కులం వ్యక్తి అని, తమ కులంలో తన పరువు పోతుందని మూర్ఖంగా భావించి.. తన కూతుర్ని మళ్లీ తన దగ్గరకు తీసుకొచ్చుకొనేందుకు మొండిగా వ్యవహరించాడని విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో మారుతీరావు తప్పులమీద తప్పులు చేసి ఉండవచ్చని.. అందుకు తీవ్ర మనోవేదనతో ఇప్పుడు ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పలువురి వాదనగా ఉంది.

తండ్రి మరణంపై కూతురు స్పందన..

ఇదిలా ఉంటే మారుతీరావు మరణంపై కూతరు అమృత స్పందించింది. ప్రణయ్‌ హత్య తర్వాత నుంచి నాన్న నాకు టచ్‌లో లేడని పేర్కొంది. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు టీవీలో చూశానని, ప్రణయ్‌ను చంపిన పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని తెలిపింది. మారుతీరావు ఆత్మహత్య విషయం మాకు ఎవరూ చెప్పలేదని ఆమె తెలిపింది. మరోవైపు మారుతీరావు మృతదేహం వద్ద సూసైడ్‌ నోట్‌ దొరికినట్లు తెలుస్తోంది. దానిలో తన మరణం తరువాత అమృత తన తల్లి వద్దకు వెళ్లాలని మారుతీరావు అందులో రాసినట్లు సమాచారం. మొత్తానికి మారుతీరావు ఆత్మహత్య ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌ మారింది. కూతురిపై బెంగతోనే మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమికంగా నిర్దారణకు వస్తున్నా.. పోలీసుల విచారణలో మున్ముందు ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో వేచిచూడాల్సిందే.

Next Story