వారిద్ద‌రు మంచి స్నేహితులు. వారి స్నేహం ప్రేమ‌గా మారింది. వారి ప్రేమ‌కి పెద్ద‌లు ఒప్పుకున్నారు. ఇంకేముంది పెళ్లి చేసుకుని జీవితాన్ని పంచుకోవాల‌ని, ప్రేమ‌మాధుర్యాన్ని ఆస్వాదించాల‌ని క‌ల‌లుగ‌న్నారు. అయితే.. వారికి పెళ్లికి అనుకోని అవాంతరాలు ఏర్ప‌డ్డాయి. రెండేళ్ల కాలంలో మూడు సార్లు వారి పెళ్లి వాయిదా ప‌డింది. ఇలా పెళ్లి వాయిదాలు ప‌డుతుండ‌డంతో ఆ జంట తీవ్ర నిరాశ చెందుతోంది.

కేరళ రాష్ట్రంలోని ఎరాన్హీపాలన్ ప్రాంతానికి చెందిన ప్రేమ్ చంద్రన్(26), సాండాసంతోష్ (23)లు ప్రేమించుకున్నారు. 2018లో పెళ్లితో ఒక్క‌టి కావాల‌నుకున్నారు. వీరి పెళ్లికి పెద్ద‌లు ఒప్పుకున్నారు. ఇంకేముంది వీరి ఆనందానికి అవ‌ధులు లేవు. 2018 మే 20న వీరి పెళ్లికి పెద్దలు ముహూర్తం నిర్ణయించారు. అయితే.. అదే స‌మ‌యంలో కేర‌ళ రాష్ట్రాన్ని ‘నిఫాస వైర‌స్ చుట్టుముట్టింది. 17 మంది చ‌నిపోయారు. ఆ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడం సరికాదని వాయిదా వేసుకున్నారు.

ఓ సంవ‌త్స‌రం త‌రువాత కేర‌ళీయుల సంవ‌త్స‌రాది అయిన ఓనం పండుగ రోజున పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు. కాగా.. పెళ్లి రోజు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌గా.. కేర‌ళ‌ను ఆక‌స్మిక వ‌ర‌ద‌లు చుట్టుముట్టాయి. వ‌ర‌ద‌ల్లో కేర‌ళ అత‌లాకుత‌లం అయ్యింది. దీంతో మ‌రోసారి వీరి పెళ్లి వాయిదా ప‌డింది. తాజాగా ఈనెల 20న పెళ్లి చేసుకోవాలని ముచ్చటగా మూడోసారి ముహూర్తం నిర్ణయించారు.

అయితే ఈసారి క‌రోనా వైర‌స్ రూపంలో ముచ్చ‌ట‌గా మూడో సారి వీరిపెళ్లి వాయిదా ప‌డింది. రెండు రోజుల క్రితం వీరి పెళ్లి జ‌ర‌గాల్సింది ఉంది. క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తుండ‌డంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో వీరు తమ పెళ్లిని మరోసారి వాయిదా వేసుకున్నారు. 2018 నుంచి ఇప్పటి వరకు మూడుసార్లు ముహూర్తం నిర్ణయిస్తే ఏదో కారణంగా తప్పిపోయాయి. దీంతో ఈ ప్రేమ జంట నిరాశ చెందారు. అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్లో పెళ్లిపీటలు ఎక్కాలనుకుంటున్న ఈ జంట. ఈ సారైనా ఎలాంటి అవాంతం రాకుండా ప్రేమ‌జంట పెళ్లి జ‌ర‌గాల‌ని ఆశిద్దాం..

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.