ఆస్తులను కాపాడుకోవడం కోసమే చంద్రబాబు జోలే..!

By Newsmeter.Network  Published on  13 Jan 2020 9:32 AM GMT
ఆస్తులను కాపాడుకోవడం కోసమే చంద్రబాబు జోలే..!

అమరావతి: అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలని రాజధాని ప్రాంత రైతులు కోరుకుంటున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. అధికార వికేంద్రీకరణ దిశగా నడిపించమని రాజధాని ప్రాంత వాసులు అడుగుతున్నారని ఆర్కే తెలిపారు. వెనుకబడిన ప్రాంతాలతో పాటు, తమ ప్రాంతాలను అభివృద్ధి చేయాలంటున్నారని, తమ భూములను చంద్రబాబు తీసుకొని మోసం చేశాడని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆర్కే పేర్కొన్నారు. దళితుల భూములను చంద్రబాబు బలవంతంగా లాక్కున్నారని ఆర్కే ఆరోపించారు. రాజధానిలో జరగనివి ఇక్కడ జరుగుతున్నట్లుగా ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. నిన్ను నమ్మి రైతులు మోసపోయారంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. పోలీసులను పట్టుకొని చంద్రబాబు బెదిరిస్తున్నారని ఆర్కే విమర్శలు గుప్పించారు.

సీఎం వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగితే డీజీపీతో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయించారన్నారు. తహశీల్దార్‌ వనజాక్షిపై దాడి, ఐపీఎస్‌ బాలసుబ్రహ్మమణ్యంపై దాడి జరిగితే పోలీసు వ్యవస్థను చంద్రబాబు తనకు అనుకూలంగా వాడుకున్నాడని ఆర్కే ఆరోపించారు. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను ఉత్తరాది చెందిన వ్యక్తి అని చంద్రబాబు అంటున్నారని.. మరి గతంలో చంద్రబాబు పెట్టుకున్న డీజీపీ ఉత్తరాదికి చెందిన వ్యక్తి కాదా అంటూ ఆర్కే ప్రశ్నించారు.

బినామీ ఆస్తులను కాపాడుకోవడం కోసమే చంద్రబాబు జోలే పడుతున్నారని ఆర్కే విమర్శించారు. హెరిటేజ్‌ కోసం చంద్రబాబు భార్య ప్లాటినం గాజులు చందాగా ఇచ్చారని ఎద్దేవా చేశారు. పండిన పంటలను చంద్రబాబు తగలబెట్టారన్నారు. చంద్రబాబు, లోకేష్‌ జీతాలు ఎందుకు జోలెలో వేయలేదన్నారు. పోలీసులకు కులాలు, మతాలు, ప్రాంతాలు ఎందుకు అంటకడుతున్నారంటూ ఆర్కే విరుచుకుపడ్డారు. సెక్షన్‌ 144, 30 అమలులో ఉండగా ఎలా శిబిరాలు, దీక్షలు పెడతారని ఎమ్మెల్యే ఆర్కే ప్రశ్నించారు. రాజధానిలో కొనసాగుతున్న దీక్షా శిబిరాలు, టెంట్‌లు ఎత్తివేయాలని డీజీపీకి ఆర్కే విజ్ఞప్తి చేశారు. రైతుల ముసుగులో టీడీపీ కార్యకర్తలు, రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు, అసాంఘిక శక్తులు ఉన్నాయన్నారు. కాగా రాజధానికి అమరావతి భూములు అనుకూలం కాదని ముందే చెప్పామన్నారు.

Next Story