బీజేపీలో మంచు తుఫాన్

By రాణి  Published on  6 Jan 2020 6:43 PM IST
బీజేపీలో మంచు తుఫాన్

ఏపీ బీజేపీకి మంచు తుఫాన్ ముప్పు పొంచి ఉందా..చడీ చప్పుడు లేకుండా వస్తోన్న ఆ మంచు తుఫాన్ తట్టుకునే కెపాసిటీ ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఉందా..అంటూ పొలిటికల్ విలేజ్ లో ఓ ఆసక్తికర చర్చ ఇప్పుడిప్పుడే రచ్చ చేస్తోంది. ఇన్నాళ్లూ ఫ్యాన్ గాలి కింద సేద తీరిన ఆ ఫ్యామిలీ..ఇప్పుడు కమలం నేతలను కలవడం కొందరిని కలవరపరుస్తోంది..మరికొందరిలో కల్లోలం రేపుతోంది. ఇంతకూ ఇంత హడావుడిగా హస్తినకు ఎందుకు వెళ్లారు..అడగ్గానే కమలం పెద్దాయన అపాయింట్ మెంట్ ఎందుకిచ్చాడు...దీని వెనుకున్న కహానీ ఏంటా అని పొలిటికల్ గుసగుసరాయుళ్లు భూతద్దం పెట్టీి మరీ విశ్లేషణలు చేస్తున్నారు.

మోహన్ బాబు ఫ్యామిలి సడెన్ గా ప్రధానిని కలిసింది. ఫ్యామిలీ...ఫ్యామిలీ గ్రూప్ ఫోటోలు దిగింది. మోహన్ బాబును మోదీ కౌగలించుకుని మరీ ఆప్యాయంగా ఆహ్వానించారు..మోహన్ బాబుతో కలిపి కూతురు లక్ష్మీ మంచు, కొడుకులు విష్ణు, మనోజ్ ప్రధానమంత్రి నరేంద్రమోడితో భేటి అయ్యారు. తర్వాత బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో కూడా సమావేశమయ్యారు. దాంతో ఫ్యామిలి బిజెపిలో చేరిందనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది.

ఊరికే వెళ్లరు మహానుభావులు..అన్న రీతిలో మంచు ఫ్యామిలీ పొలిటికల్ సెటైర్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఊరికే కలిశామా..వచ్చామా అన్నతరహాలో కాకుండా ఏపీ రాజకీయాలపై కూడా సీరియస్ డిస్కషన్స్ కూడా నడిచినట్లు సమాచారం. మొత్తం కుటుంబాన్ని పార్టీలో చేరాల్సిందిగా భేటి సందర్భంగా మోడీ ఆహ్వానించినట్లు సమాచారం. 2014 ఎన్నికలకు ముందు కూడా మోడి, అమిత్ షా తో మోహన్ బాబు కుంటుంబం చాలా సార్లే భేటి అయ్యింది. కానీ వివిధ కారణాల వల్ల వాళ్ళెవరూ పార్టీలో చేరలేదు. అదే సమయంలో అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు. ఎన్నికల టైమ్లో చంద్రబాబును చెడామెడా తిట్టి ..తన స్కూల్ పిల్లలతో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ర్యాలీనే తీశారు మోహన్ బాబు

జగన్ అధికారంలోకి వచ్చాక సైలెంట్ అయిన మోహన్ బాబు

ఎన్నికల టైమ్ లో ప్రెస్ మీట్లు పెట్టి మరీ జగన్ పొగిడి...చంద్రబాబును తిట్టిన మోహన్ బాబు...తర్వాత ఏక్ దమ్ సైలెంట్ అయ్యారు. ఎన్నికల్లో గెలిచి...వైసీపీ అధికారంలోకి వచ్చినా..రాజకీయాల్లో మాత్రం ఆయన యాక్టివ్ గా లేరు. అదే సమయంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా మోహన్ బాబును జగన్ నియమించబోతున్నారంటూ పెద్ద ఎత్తునే ప్రచారం జరిగింది. కానీ ఇంత వరకూ ప్రభుత్వంలో ఎటువంటి పదవి దక్కలేదు. ఇటువంటి సమయంలోనే మొత్తం ఫ్యామిలితో మోహన్ బాబు ప్రధానమంత్రిని కలవడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. మరి బిజెపిలో చేరే ఉద్దేశ్యంతోనే మోడి, అమిత్ షాలను కలిశారో లేకపోతే ఏదో మర్యాద పూర్వక బేటి మాత్రమేనా అన్నది తేలాలి. కాకపోతే మొత్తం ఫ్యామిలి అంతా బిజెపిలో చేరిపోయినట్లే ప్రచారం మొదలైపోయింది.

మొత్తానికి బీజేపీలో మంచు తుఫాన్ షురూ అయినట్లేనన్న పుకారు...ఇప్పుడు షికారు చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు మద్దతు తెలిపిన వారందరికీ గుర్తు పెట్టుకుని మరీ పదవులు ఇస్తున్నారు. కానీ ఇంతవరకు మోహన్ బాబుకు మాత్రం ఎలాంటి హామీ కానీ జగన్ శిబిరం నుంచి రాలేదని తెలుస్తోంది. అందుకే బీజేపీ వైపు మంచు ఫ్యామిలీ చూస్తుందనే వాదన వినిపిస్తోంది. మరి చూడాలి...బీజేపీలో మంచు ఫ్యామిలీ చేరుతుందా లేదా అన్నది.

Next Story