దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హ‌త్య‌ కేసు నిందితులను పోలీసులు శుక్రవారం ఎన్‌కౌంటర్‌ చేశారు. దిశ అత్యాచారానికి గురైన ప్రాంతం తొండుపల్లి టోల్‌ప్లాజా సర్వీసు రోడ్డు నుంచి పెట్రోల్, డీజిల్‌ పోసి మృతదేహాన్ని కాల్చిన చటాన్‌పల్లి అండర్‌పాస్‌ ప్రాంతంలో క్రైమ్‌ సీన్‌ను రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా ఒక్క‌సారిగా పోలీసుల‌పై రాళ్లు రువ్వుతూ పారిపోయేందుకు ప్రయత్నించారు. ఆత్మ‌ర‌క్ష‌ణ‌పై కాల్పులు జ‌రిపిన పోలీసులు నిందితుల‌ను మ‌ట్టుబెట్టారు.

ఈ ఎన్‌కౌంటర్‌పై టాలీవుడ్‌ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్ప‌టికే దిశ త‌ల్లిదండ్రుల‌ను ఇంటికి వెళ్లి మ‌రీ ప‌రామ‌ర్శించిన‌ టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్ నిందితుల ఎన్‌కౌంట‌ర్‌పై స్పందించారు. ఆ న‌లుగురు నిందితులు చచ్చారు అనే వార్తలో కిక్కు ఉందని ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న ఆనందాన్ని పంచుకొన్నాడు.

అంతేకాకుండా.. ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది.. తుపాకీలకు దండం పెట్టుకోవాలని ఉంది.. ఆ పోలీసుల కాళ్లు మొక్కాలని ఉందని.. ఈ రోజు నీ ఆత్మ దేవుడిని చేరింది చెల్లెమ్మా’ అంటూ త‌న‌ తీవ్ర ఆవేద‌న‌ను ట్వీట్‌లో పంచుకున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.