మహేంద్రుడి రిటైర్‌మెంట్‌పై మేనేజర్‌ క్లారిటీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 July 2020 12:33 PM IST
మహేంద్రుడి రిటైర్‌మెంట్‌పై మేనేజర్‌ క్లారిటీ

కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) నిరవదికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అసలు ఈ ఏడాది ఐపీఎల్‌ ఉంటుందా..? అని సందేహాలు మొదలైన వేళ.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలి బుధవారం చేసిన ప్రకటన క్రికెట్‌ అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది ఐపీఎల్‌ 13వ సీజన్‌ ని నిర్వహించి తీరుతామని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా వేదికగా.. అక్టోబర్‌లో జరిగే ప్రపంచకప్‌ నిర్వహణపై ఐసీసీ ప్రకటన చేసిన తరువాతనే ఐపీఎల్‌ షెడ్యూల్‌పై స్పష్టత ఉంటుందని తెలిపారు.

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని భవితవ్యం ఐపీఎల్‌పైనే ఆధారపడి ఉంది. మహేంద్రుడు టీమ్‌ఇండియా జెర్సీలో కనిపించి ఏడాదికిపైనే అయ్యింది. 2019 ప్రపంచకప్‌ న్యూజిలాండ్‌తో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఆడిన అనంతరం మళ్లీ ఇంత వరకు బ్యాట్‌ పట్టలేదు ఈ కూల్‌ కెప్టెన్‌. తన కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా కాలం గడుపుతున్నాడు. ఇక ధోని రిటైర్‌మెంట్‌ పై అనేక వార్తలు వచ్చాయి. అయితే.. వాటిపై ఇంతవరకు మహీ స్పందించలేదు. తాజాగా.. అతడి చిన్ననాటి స్నేహితుడు, మేనేజర్‌ మిహిర్‌ దివాకర్‌ స్పష్టత నిచ్చాడు. ధోనికి ఇప్పట్లో ఆటకు వీడ్కోలు పలికే ఆలోచనలు లేవన్నాడు.

‘మేమిద్దరం స్నేహితులం. అయినప్పటికి క్రికెట్‌కు సంబంధించి ఎప్పుడూ మాట్లాడుకోం. కాని.. ధోనిని చాలా దగ్గరగా చూశాను.. అతడి మాటలను బట్టి ధోనికి ఇప్పట్లో రిటైర్‌మెంట్ ఆలోచనలు లేవని అర్థం అవుతోంది. ఐపీఎల్‌లో రాణించాలని ఎంతో ఆశగా ఉన్నాడు. అందుకోసం ఈ ఏడాది ఆరంభంలో లాక్‌డౌన్‌ కంటే నెల ముందే చెన్నైలో సాధన మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఇంట్లోనే ఫిట్‌నెస్‌ కాపాడుకుంటున్నాడని, పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే మహీ ప్రాక్టీస్‌ మొదలు పెడుతాడని' తెలిపాడు.

ఐపీఎల్‌లో ధోని రాణిస్తే టీమ్‌ఇండియాలో ఎంపిక చేసేందుకు తమకేమీ అభ్యంతరం లేదని టీమ్‌ఇండియా కోచ్‌ రవిశాస్త్రి ఓ సంద్భంలో వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో టీ20 ప్రపంచకప్‌ నిర్వహించడం సాధ్యం కాదని క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) స్పష్టం చేసింది. ప్రపంచకప్‌ రద్దు అయితే.. ఆ విండోలో ఐపీఎల్‌ను నిర్వహించడానికి బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.

Next Story