'మన నుడి - మన నది' కై ప‌వ‌న్‌తో క‌లిసి న‌డుద్దాం.!

By Medi Samrat  Published on  23 Nov 2019 12:42 PM GMT
మన నుడి - మన నది కై ప‌వ‌న్‌తో క‌లిసి న‌డుద్దాం.!

రాజకీయాలకు అతీతంగా, తెలుగు జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుగు భాష పరిరక్షణ కోసం ఉద్యమించే వారికి మద్దతు పలకాలని ఏపీ శాసనసభ మాజీ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్ పిలుపునిచ్చారు. ఒక రాజకీయ పార్టీగా మాతృ భాష విషయంలో జనసేన అధినేత‌ పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఈ విషయంలో మిగిలిన పార్టీలు కూడా ఆయన్ను అనుసరిస్తే భాషకు మహోపకారం చేసిన వార‌మ‌వుతామన్నారు.

శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరావుతో కలసి పవన్ కళ్యాణ్ ను కలిశారు. తెలుగు భాషా పరిరక్షణకు చేపట్టిన 'మన నుడి - మన నది' కార్యక్రమానికి మద్దతు తెలిపారు. తెలుగు భాషతోపాటు నదీ పరిరక్షణకు చేపట్టాల్సిన పలు అంశాలపై పవన్ కళ్యాణ్ తో చర్చించారు.

Image result for mandali buddha prasad

అనంతరం బుద్దప్రసాద్ మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ తెలుగు భాష పరిరక్షణ కోసం నడుంకట్టిన సందర్భంలో 'మన నుడి - మన నది' కార్యక్రమాన్ని ప్రారంభించి తెలుగు భాషోద్యమానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న సమయంలో ఓ తెలుగు భాషాభిమానిగా వారిని హృదయపూర్వకంగా అభినందించడం జరిగింది. ఆంగ్ల మాధ్యమం పట్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమగ్రమైన తెలుగు వ్యక్తిత్వ నిర్మాణానికి కృషి చేస్తున్నారు.

భాషతో ఏర్పడిన జాతి తెలుగు జాతి. భాష ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడు జాతి నశిస్తుందన్న విషయాన్ని గుర్తించి మన భాషను కాపాడుకోవడానికి ముందుకు వచ్చినందుకు సంతోషం. తెలుగు భాష మనుగడ కోసం ఉద్యమించాల్సిన పరిస్థితులు ప్రభుత్వం కల్పించింది. ఈ సవాలును మనం ధీటుగా ఎదుర్కొని జాతిని మేల్కొలిపి, భాషను సంరక్షించుకుని, జాతిని నిలబెట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. అదే ఆలోచనను పవన్ కళ్యాణ్ వివరించారు. ఒక భాషాభిమానిగా ఆయనకు నా వంతు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తా. తెలుగు భాష అభిమానులంతా ఒక సమైక్య వేదిక ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అన్నారు.

భాషాభిమానులంతా పవన్ తో కలసి రావాలి - జొన్నవిత్తుల

పవన్ కళ్యాణ్ తో భాషాభివృద్ధికి సంబంధించి అనేక అంశాలపై చర్చించాం. ఆయన ఒక బలమైన సంకల్పంతో తెలుగు భాష పరిరక్షణ, నదుల కాలుష్యాన్ని నివారించేందుకు కంకణం కట్టుకున్నారు. అందుకు అన్ని వర్గాల వారు, ప్రకృతి ప్రేమికులు, భాషా ప్రేమికులు, పండితులు, కవులు కలసి రావాలని కోరారు. పవన్ కళ్యాణ్ ముందుండి అందరితో కలసి ఉద్యమిస్తానని పిలుపునిచ్చారు. ఆ పిలుపుకు ప్రతిస్పందనగా ఆయన్ని కలవడం జరిగింది.

నదీ పర్యావరణ పరిరక్షణ, భాషా పరిరక్షణ కార్యక్రమాలపై ఆంగ్ల మాధ్యమంలో జాతి కొట్టుకుపోకుండా తెలుగు భాషతో పాటు ఆంగ్ల భాషను మన విద్యార్ధులకు అందించడం ఎలా? తెలుగు సంస్కృతి సంప్రదాయాలను నిలుపుకోవడం ఎలా? దీనికి మనవంతు మనం చేయాల్సింది ఏమిటి? అనే అంశాల మీద చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ తీసుకున్న నదీ పరిరక్షణ-భాషా పరిరక్షణ ఉద్యమానికి నా సంపూర్ణ మద్దతు ఇస్తున్నాను. ఈ అంశంలో నిరంతరం వారితో కలసి నా శక్తి సామర్ధ్యాల మేరకు వారి విజయానికి సహకరిస్తాను. పండితులు, కవులు తరలివచ్చి భాషా పరిరక్షణ ఉద్యమానికి మద్దతు తెలపాలి" అని కోరారు.

Next Story