ఛాలెంజ్ కోసం టాయిలెట్ నాకాడు.. ఆతరువాత..
By తోట వంశీ కుమార్ Published on 26 March 2020 8:11 PM ISTకరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 20వేల మందికి మృత్యువాత పడగా.. నాలుగున్నర లక్షల మంది కరోనా పాజిటివ్ తో ఆస్పత్రల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా కట్టడి కోసం చాలా దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. ఇదిలా ఉంటే.. కరోనా జోలికి వెళ్లొద్దని ఎంతమంది చెప్పినా.. కొంతమంది మూర్ఖులు మాట వినడం లేదు.
కరోనా వైరస్ దానంతట అది.. ఇతరులకు సోకదు. బాధితుడిని లేదా అతడు ముట్టుకున్న వస్తువును తాకితేనే అంటుకుంటుంది. బాధితుల శ్వాస, వాళ్లు తిరిగే ప్రాంతంలోని గాలి, ఉమ్మి తదితరాల్లో వైరస్ బతికే ఉంటుంది. వైద్య నిపుణులు ఈ విషయాన్ని పదే పదే చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయి.
కరోనా వైరస్‌ను పెద్దగా పట్టించుకోని యువత.. ఇటీవల #CoronaChallenge పేరుతో వింత వింత చర్యలకు పాల్పడుతున్నారు. వివిధ ప్రాంతాల్లో వస్తువులను నాకుతూ వీడియోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ పాపులారిటీ సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి ఛాలెంజ్ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇటీవల ఓ మోడల్ విమానంలోని టాయిలెట్ కమోడ్ నాకుతూ వీడియో తీసుకుని ఛాలెంజ్ విసిరింది. అది వైరల్‌గా మారడంతో మిగతా వ్యక్తులు కూడా ఈ ఛాలెంజ్ స్వీకరించి.. టాయిలెట్లు నాకుతున్నారు. కరోనా వైరస్ ఛాలెంజ్‌లో భాగంగా బేవెర్లీ హిల్స్‌కు చెందిన గేషాన్ మెండేస్ అనే 21 ఏళ్ల యువకుడు కూడా టాయిలెట్ కమోడ్ సీటును నాకుతూ వీడియో తీసుకున్నాడు. ఈ పనికి పాల్పడిన కొద్ది రోజుల్లోనే అతడిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. వైద్య పరీక్షల్లో అతడికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని అతడు ట్విట్టర్ ద్వారా వెల్లడించినట్లు ‘డైలీ మెయిల్’ వార్తా సంస్థ వెల్లడించింది.