రవీంద్ర భారతి వద్ద పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
By తోట వంశీ కుమార్ Published on 10 Sept 2020 4:40 PM ISTకరోనా వైరస్ తెచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ మహమ్మారి ధాటికి కొన్ని కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించాయి. తాజాగా హైదరాబాద్ రవీంద్ర భారతి ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. కరోనా కారణంగా ఉద్యోగం పోయిందని మనస్థాపం చెందిన ఓ వ్యక్తి పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు.
'కేసీఆర్ సార్.. జై తెలంగాణ అంటూ' నినాదాలు చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తమను ఆదుకోవాలంటూ చేతులు జోడించి ప్రాదేయపడడం కనిపించింది. తెలంగాణ వచ్చినా తనకు న్యాయం జరగలేదని అంటూ అరుచుకుంటూ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మంటలను ఆర్పీ.. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. బాధితుడిది మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్ కు చెందిన నాగులుగా గుర్తించారు. అతను అబిడ్స్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో పనిచేసేవాడు. అయితే.. కరోనా కారణంగా పెట్టిన లాక్‌డౌన్ వల్ల నాగులు ఉపాధి కోల్పోయాడు. దాంతో కొన్ని నెలలుగా ఖాళీగా ఉంటున్నాడు. ఉపాధి దొరకక పోవడంతో జీవితంపై విరక్తి చెందినట్లు తెలుస్తోంది. పోలీసులతో తనకు బతకడానికి పని లేదంటూ ఆయన అరిచి చెప్పాడు. సగం శరీరం కాలినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వెంటనే బాధితుడ్ని ఆటోలో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నారు. కాగా.. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.