పాత బస్తీలో దారుణం.. ముగ్గురు అక్కలపై దాడి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Jun 2020 5:40 AM GMT
పాత బస్తీలో దారుణం.. ముగ్గురు అక్కలపై దాడి

ఓ యువకుడు ఉన్మాదిగా మారాడు. తోబుట్టువులను పై దాడి చేశాడు. ఇద్దరు అక్కలు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మూడో అక్కపై దాడి చేసి చంపాలనుకున్నప్పుడు బావ అడ్డుగా వచ్చాడు. దీంతో బావను పొడిచాడు. ఆ తరువాత నాలుగో అక్కను చంపాలనుకున్నాడు. కానీ కుదరలేదు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని పాతబస్తీలో సోమవారం రాత్రి జరిగింది.

చాంద్రాయణగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని భార్కస్‌ సలాలాలో అహ్మద్‌ ఇస్మాయిల్‌(27) అనే మాజీ బౌన్సర్‌ తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. సోమవారం ఇంటికి వచ్చిన ఇద్దరు అక్కలు రజియా బేగం, జకీరాబేగంలపై కత్తిలో దాడి చేశాడు. ఆ తరువాత అర కిలోమీటరు దూరంలోని సబీల్‌ కాలనీలో ఉంటున్న మూడో అక్క నూరా బేగం ఇంటికి వెళ్లి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో బావ అడ్డుగా రావడంతో.. అతడిపైనా దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. రజియాబేగం అప్పటికే చనిపోయింది. ప్రాణపాయ స్థితిలో ఉన్న జకీరాబేగం, నూరాబేగం, ఉమర్‌లను ఒవైసీ ఆస్పత్రికి తరలించారు. జకీరా బేగం చనిపోయినట్లు వైద్యులు తేల్చారు. నూరాబేగం, ఉమర్‌ ఓవైసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడు ఇస్మాయిల్ గత మార్చిలో తన భార్యను కత్తితో గొంతుకోసి హత్య చేశాడు.

ముందుగా వేసుకున్న పథకం ప్రకారం..

తన అక్కలను చంపేందుకు ముందుగానే పథకం వేశాడు ఇస్మాయిల్. సోమవారం ఉదయం తల్లికి బాగాలేదని అక్క రజియాబేగంకు ఫోన్‌ చేశాడు. సాయంత్రం జకిరా బేగంకు చెప్పాడు. వారిద్దరు ఇంటికి వచ్చారు. సాయంత్రం ఏడు గంటల సమయంలో వారిద్దరు వంటింట్లో ఉండగా.. వారిపై కత్తితో దాడి చేశాడు. ఆతరువాత మూడో అక్క నూరాబేగం ఇంటికి వెళ్లాడు. ఆమెపై కత్తితో దాడి చేశాడు. అడ్డొచ్చిన ఆమె భర్తపైనా దాడి చేశాడు. అనంతరం నాలుగో అక్క మలికాబేగంను చంపేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. అయితే.. అక్కను ఆస్పత్రిలో చేర్చారని తెలుసుకుని వారిపై దాడి చేసేందుకు ఆస్పత్రికి వెళ్లాడు. అయితే.. అక్కడ పోలీసులను చూసి పారిపోయాడు. ఆస్పత్రికి వెళ్లే సమయంలో అతనికి దారిలో ఓ బంధువు కనిపించాడు. తన అక్కలు చెప్పడం వల్లనే తాను భార్యను చంపానని, దానికి ప్రతీకారం తీర్చుకుంటున్నానని అతడితో చెప్పాడు. కాగా.. ఆదివారం కుటుంబ సభ్యులంతా ఆస్తి పంచుకునేందుకు సమావేశమయ్యారు. ఆ సమావేశం ప్రశాంతంగా ముగిసింది. ఆతరువాతే నిందితుడు హత్యకు ప్రణాళిక రచించాడని బావిస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Next Story