కరోనాను అడ్డుకోవడం కోసం.. నాలుక కోసేసుకున్నాడు
By తోట వంశీ కుమార్ Published on 19 April 2020 7:22 PM IST
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి భారతదేశంలో కూడా రోజు రోజుకు విజృంభిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో 15వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 500 మందికి పైగా మరణించారు. కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా.. రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. మధ్య ప్రదేశ్‌కి చెందిన ఓ యువకుడు గ్రామ దేవతకు నాలుకను బలిస్తే.. కరోనా వ్యాప్తిని ఆదేశ అడ్డుకుంటుందని భావించి తన నాలుకను కోసేసుకున్నాడు.
ఘటన వివరాల్లోకి వెళితే.. వివేక్ శర్మ అనే యువకుడు తన సోదరుడితో పాటు 8 మంది కార్మికులతో కలిసి మోరెనా జిల్లాలోని భవాని మాత ఆలయంలో విస్తరణ పనులు చేస్తున్నాడు. ఓ రోజు మార్కెట్ వెలుతున్నానని చెప్పి తిరిగిరాలేదు. దీంతో అతడి సోదరుడు వివేక్ శర్మకు చాలా సార్లు ఫోన్ చేశాడు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా అతను లిప్ట్ చేయలేదు. వేరోక వ్యక్తి ఫోన్ ఎత్తి.. వివేక్ నాదేశ్వరీ దేవాలయం వద్ద నాలుక కోసుకున్నాడని చెప్పారు.
ఈ ఘటన పై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొద్ది రోజులుగా వివేక్ తన సొంతూరికి వెళ్లిపోతానని అక్కడి వారిని అడుగుతున్నాడు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు కేంద్రం లాక్ డౌన్ విధించడంతో .. అది సాధ్యం కాదని అక్కడి వారు అతనితో చెప్పారు. నాదేశ్వరీ ఆలయంలో నాలుకను కోసుకోవడం ద్వారా కరోనా వ్యాప్తిని దేవత అడ్డుకుంటుందని వివేక్ నమ్మినట్లు చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటే.. తను ఇంటికి వెళ్లిపోవచ్చు అనే ఆలోచనతో వివేక్ ఈ పని చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. డాక్టర్లు అతనికి నాలుకను అతికించే పనిలో ఉన్నారు.