హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి స‌మోసాలు ఆర్డ‌ర్ ఇచ్చాడు.. ఆ త‌రువాత ఏం జ‌రిగిందంటే..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 March 2020 7:32 AM GMT
హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి స‌మోసాలు ఆర్డ‌ర్ ఇచ్చాడు.. ఆ త‌రువాత ఏం జ‌రిగిందంటే..

క‌రోనా వైర‌స్‌(కొవిడ్‌-19) ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి ధాటికి వేల సంఖ్య‌లో మృత్యువాత ప‌డ‌గా.. ల‌క్ష‌ల్లో దీని బాధితులు ఉన్నారు. క‌రోనా క‌ట్ట‌డికి కేంద్రం 21 రోజుల పాటు దేశ వ్యాప్త లాక్‌డౌన్ ను విధించిన సంగ‌తి తెలిసిందే. ఇక క‌రోనా వైర‌స్ త‌మ‌కు సోకింద‌ని ప‌లువురు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతుండ‌డంతో ప్ర‌జ‌ల కోసం హెల్ఫ్‌లైన్లు ఏర్పాటు చేశారు. క‌రోనా పై ప్ర‌జ‌ల‌కు కావాల్సిన స‌మాచారాన్ని అందిస్తున్నాయి. కానీ కొంద‌రు ఆక‌తాయిలు చేసే ప‌నుల‌కు హ‌ద్దే లేకుండా పోయింది. ఓ ఆక‌తాయి.. క‌రోనా హెల్ప్‌లైన్ సెంట‌ర్‌కు కాల్ చేసి స‌మోసాలు ఆర్డ‌ర్ ఇచ్చాడు. ఒక్క‌సారి ఫోన్ చేస్తే వారు కూడా పెద్ద‌గా ప‌ట్టించుకునేవారు కాదేమో.. ప‌దే ప‌దే ఫోన్ చేస్తూ వారిని విసిగిస్తున్నాడు. దీంతో అధికారులు ఆక‌తాయికి స‌రైన బుద్ది చెప్పారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌రప్ర‌దేశ్ జ‌రిగింది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని రాంపూర్‌కు చెందిన ఓ వ్య‌క్తి క‌రోన బాధితుల కోసం ఏర్పాటు చేసిన హెల్ఫ్ లైన్ సెంట‌ర్ కి ప‌దే ప‌దే కాల్ చేసి నాలుగు స‌మోసాలు తెమ్మ‌ని డిమాండ్ చేశాడు. సిబ్బంది ఎంత చెప్పిన అత‌ను విన‌లేదు. దీంతో సిబ్బంది అత‌డికి స‌మోసాలు అంద‌జేయ‌డ‌మే కాకుండా.. త‌మ విధుల‌కు ఆటంకం క‌లిగించినందుకు బోన‌స్‌గా మ‌రుగుదొడ్లు శుభ్రం చేయాల‌నే సామాజిక శిక్ష విధించిన‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. అత‌డికి సరైన శిక్షే ప‌డింద‌ని ప‌లువురు నెటీజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

క‌రోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు బాధితుల సంఖ్య 1251కి చేర‌గా.. మృతుల సంఖ్య 32గా న‌మోదైంది.

Next Story