తమిళనాడులో దారుణం.. ఆ కారణంతో పెళ్లి ఆపారని..
By అంజి Published on 8 April 2020 7:12 PM IST
మధురై: తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. అవనియపురంలో ఓ 24 ఏళ్ల యువకుడిని కొందరు దుండగులు అతి దారుణంగా హత్య చేసి చంపారు. నడి రోడ్డుపై కిరాతకంగా చంపి దారుణానికి తెగబడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. ఇటీవల కె.విజయ్ కుమార్ అనే యువకుడికి స్థానిక యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఇరు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకోవడంతో నిశ్చితార్థ కార్యక్రమం కూడా జరిగిపోయింది. ఆ తర్వాత పెళ్లికి సంబంధించి పనులు మొదలు పెట్టారు.
అదే సమయంలో పెళ్లి కూతురు ఇంటికి పోలీసులు వచ్చి పెళ్లి పనులను ఆపేశారు. పెళ్లి కూతురు మైనర్ అని తమకు సమాచారం వచ్చిందని, 18 ఏళ్ల నిండకుండా పెళ్లి చేయకూడదని పోలీసులు చెప్పి వెళ్లిపోయారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. పెళ్లి కొడుకు విజయ్ కుమార్.. పెళ్లి ఆగిపోవడంతో ఆగ్రహావేశానికి లోనయ్యాడు. పెళ్లి కూతురు ఇంటికి, ఆ పక్కింటి వారికి మాటలు లేవు. ఆ పక్కింటి యువకుడు కావాలనే ఇదంతా చేశాడని పెళ్లి కొడుకు కక్ష పెంచుకున్నాడు. పక్కింట్లో భార్యతో కలిసి నివసిస్తున్న రామమూర్తిని చంపడానికి ప్లాన్ వేశాడు.
సోమవారం రాత్రి ఎన్.రామమూర్తి తండ్రి రాజమన్ నగర్‌లో దిగబెట్టి తిరిగి కన్నన్ కాలనీలోని తన ఇంటికి బయల్దేరాడు. ఈ క్రమంలోనే రామమూర్తిని పెళ్లి కొడుకు విజయ్ కుమార్ అడ్డుకున్నాడు. ప్రాణపాయంతో తప్పించుకుందామనుకున్న రామమూర్తిని (24)ని పెళ్లి కొడుకు విజయ్ కుమార్, అతని స్నేహితులు దారుణంగా హత్య చేశారు. యువకుడి హత్యకు పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురి సోదరుడి సహాయం తీసుకున్నాడని సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అవనియపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గత వారం పెళ్లి కూతురు మైనర్ అని ఎవరో పోలీసులను అప్రమత్తం చేశారని, ఆ తర్వాత పెళ్లి కొడుకు కె.విజయ్ కుమార్ తన కుమారుడిపై శత్రుత్వం పెంచుకున్నాడని.. రామమూర్తి తండ్రి నలుస్వామి (42) చెప్పారు.