కరోనా ప్యాకేజీ పై మాల్యా స్పందన
By తోట వంశీ కుమార్
బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలను తీసుకుని లండన్ పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా కేంద్రం ప్రటించిన రూ.20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై స్పందించాడు. అవకాశం ఉన్న ప్రతి సారీ తన రుణాలను చెల్లిస్తానని చెప్పుకుంటూ వస్తున్న ఈ లిక్కర్ కింగ్ మరోమారు అదే ప్రతిపాదనతో ముందుకు వచ్చాడు.
బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను 100శాతం తిరిగి చెల్లిస్తాననే తన ప్రతి పాదనను కేంద్ర ప్రభుత్వం మన్నించాలని కోరాడు. బకాయిలు చెల్లించిన తరువాత తన మీద ఉన్న కేసులను కొట్టేయాలని విజ్ఞప్తి చేశాడు. కరోనా పై పోరుకు ప్రభుత్వం ప్రకటించిన భారీ ప్యాకేజీపై అభినందనలు తెలియజేశాడు.
‘కొవిడ్ -19 ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు. వారు కోరుకున్నంత కరెన్సీని ముద్రించవచ్చు, కాని ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ రుణాలను వంద శాతం తిరిగి చెల్లించే నా లాంటి సహకారిని సర్కారు నిరంతరం విస్మరించాలా? డబ్బులు తీసుకుని నా మీద ఉన్న కేసులు కొట్టేయండి' అని విజయ్ మాల్యా ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.
భారతదేశంలోని వివిధ బ్యాంకుల నుంచి మాల్యా రూ.9వేల కోట్ల రుణాలు పొంది విదేశాలకు పారిపోయాడు. ప్రస్తుతం ఆయన లండన్‌లో ఉన్నాడు. లండన్ నుంచి మాల్యాను భారతదేశానికి రప్పించడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. భారతదేశానికి అప్పగించాలని కోరుతూ వెలువడిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా లండన్ హైకోర్టులో మాల్యా చేసిన అప్పీల్ ను ఆ కోర్టు కొట్టి వేసింది. దీంతో ఆయన అక్కడి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.