లొంగుబాటు దిశగా మరో మావోయిస్టు అగ్రనేత..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Sep 2020 7:16 AM GMT
లొంగుబాటు దిశగా మరో మావోయిస్టు అగ్రనేత..!

మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు లొంగిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వెలువడిన మరుసటి రోజే మరో అగ్రనేత, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ భూపతి కూడా లొంగిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వేణుగోపాల్ కూడా అనారోగ్య కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. మావోయిస్టు పార్టీలో అగ్రనాయకత్వంలో పనిచేసిన కిషన్‌జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వరరావుకు వేణుగోపాల్ స్వయానా తమ్ముడు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పెద్దపల్లికి చెందినవారు. పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌లో నాయకుడిగా మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ భూపతి అలియాస్‌ సోను అలియాస్‌ మాస్టర్‌ అలియాస్‌ అభయ్‌ పేర్లతో పనిచేశారు. మహారాష్ట్రంలోని గడ్చిరోలి మావోయిస్టు దండకారణ్య ప్రత్యేక జోనల్‌ కమిటీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీలో కీలక పాత్ర పోషించిన మల్లోజుల 2010లో చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్ మరణం తర్వాత పార్టీ అధికార ప్రతినిధిగా నియమితుడయ్యారు. 2010లో దంతెవాడ ఘటనలో 70 మందికిపైగా సీఆర్‌పీఎఫ్‌ బలగాలు మృతి చెందడం వెనక వేణుగోపాల్‌ ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, చత్తీస్‌గఢ్‌లలో వేణుగోపాల్ తలపై రివార్డు కూడా ఉంది.

మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటును స్వాగతిస్తున్న పోలీసులు.. వారితో సహా ఎవరు వచ్చినా స్వాగతిస్తామని పేర్కొన్నారు. ఉద్యమంలోకి వెళ్లి తుపాకి పట్టిన మల్లోజుల మంచి రచయిత కూడా. గిరిజన, గోండు జీవితాలకు అక్షర రూపం ఇచ్చారు. సాధన కలం పేరిట అనేక పుస్తకాలు రాశారు. గతంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు జంపన్న, సుధాకర్‌ వంటి అగ్రనేతల లొంగుబాటుకు సహకరించినట్లుగానే గణపతికి కూడా సహకరిస్తామని పోలీసులు తెలిపారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టులందరికీ పునరావాసం, ఆరోగ్య సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర పోలీసులు మానవతా దృక్పథంతో సాయం చేశారన్నారు.

Next Story