నిలువెల్లా ఆత్మవిశ్వాసం మేజర్ ఆర్చీ సొంతం
By మధుసూదనరావు రామదుర్గం Published on 12 Aug 2020 6:11 PM ISTఆర్చీది ఆర్మీ నేపథ్యమున్న కుటుంబమేం కాదు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మధ్యతరగతి కుటుంబం. ఇంట్లో ముగ్గురు అమ్మాయిలు. ఆర్చీ అందరికంటే చిన్న. తండ్రి ఆర్చీ చిన్నప్పుడే క్యాన్సర్‌తో మరణించాడు. అప్పట్నుంచి తల్లి కుటుంబ బాధ్యతలు మోసుకుంది. చదువును మించిన ఆస్తి లేదని ముగ్గురు అమ్మాయిల్ని బాగా చదివించింది. ఆర్చీ చిన్నమ్మాయి కావడంతో కాస్త స్వేచ్ఛగానే పెరిగింది.
తను ఎనిమిదో క్లాసులోఉన్నప్పుడు స్కూలుకు వెళుతుంటే ఓ పెద్ద ప్రకటన హోర్డింగ్‌ను తన్మయత్వంతో చూస్తుండి పోయింది. అది ఆర్మీ ప్రవేశానికి సంబంధించిన యాడ్. అలివ్ గ్రీన్ యూనిఫామ్‌తో ఓ సైనికుడు దృఢంగా కనిపిస్తూ.. మీలో ఆ సత్తా ఉందా అని అడుగుతుంటాడు. ఆర్చీకెందుకో తననే నిలదీస్తున్నట్లు, తనకే సవాల్ విసురుతున్నట్లు అనిపించింది.
ఆరోజే అమ్మ వద్ద కూర్చొని ‘నేను పెద్దయ్యాక ఆర్మీలోకి వెళతా’నంది. తల్లి ఏం మాట్లాడలేదు. కొద్ది సేపు తర్వాత మొదట చదువుకో తర్వాత చూద్దాం అంది. అయితే ఆ ఉత్సాహ కెరటం ఊరుకుంటుందా? ఇంటర్ తర్వాత నేషనల్ ఢిపెన్స్ అకాడెమీలో చేరేందుకు దరఖాస్తు చేసుకుంది. అయితే అమ్మాయిలు డిగ్రీ పూర్తయితేనే అర్హులని తెలుసుకుని కాసింత నిరుత్సాహ పడింది. అది కొద్దిసేపే, వెంటనే సరే డిగ్రీ పూర్తి చేద్దాం ఇందులో ఏముంది అని సర్ది చెప్పుకుంది. జేఎన్‌యూ ఢిల్లీ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్’ ఇంజనీరింగ్ లో చేరింది. కోర్సు పూర్తయిందో లేదో ఓ పేద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అయితే అదే సమయంలో ఆర్మీలో చేరేందుకు రాసిన సర్వీసెస్ సెలక్షన్ బోర్డు పరీక్షలో పాసయ్యింది. ఇంటర్వ్యూకు పిలుపొచ్చింది.
అక్కడ వచ్చిన అభ్యర్థులందరూ ఆర్మీ కుటుంబ నేపథ్యం ఉన్నవారే! ఇంటర్వ్యూ చేసినా ఆశలు పెట్టుకోలేదు. అయితే నాలుగు నెలల తర్వాత అదృష్టం తలుపు తట్టింది. తను సెలెక్ట్ అయినట్టు సమాచారం. ఇక ఆర్చీ ఆనందానికి పట్టుపగ్గాల్లేవు. బంధువులు చాలా మంది అభ్యంతరాలు చెప్పారు. ఆడపిల్లవి ఆర్మీ ఎందుకు అని సవాలక్ష ప్రశ్నలు, సందేహాలు లేవనెత్తారు. కానీ ఆర్చీ అవేవీ వినిపించుకునే స్థితిలో లేదు. తన జీవిత లక్ష్యం సిద్ధిస్తోందని ఉరిమే ఉత్సాహంతో బయలుదేరింది.
ఈ సందర్భంలో ఆర్చీకి బాసటగా నిలిచిన వారు ఒక్కరే.. ఆమె తల్లి. ఎందుకంటే ఆమెకు ఆర్చీలో ఈ కోరిక ఎన్నాళ్ల నుంచి ఉందో తెలుసు. తన కలలు నిజం చేసుకోడానికి ఎంత తపన పడింతో ఇంకా బాగా తెలుసు. అందుకే ఆర్చీ వెంట నిలించింది కొండంత అండగా. అమ్మే తనవైపు ఉన్నప్పుడు ఇక ఎవరేమంటే నాకేం అనుకుంది ఆర్చీ. వెంటనే చెన్నైలో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీలో చేరింది.
ఏడాది శిక్షణానంతరం 2009లో పాక్ సరిహద్దులోని రాజోరిలో చేరింది. అక్కడ ర్యాపిడ్ బెటాలియన్‌లోని ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ యూనిట్స్ విభాగంలో బాధ్యతలు అప్పగించారు. సైనికులువిధుల్లో వినియోగించే వస్తువులను పరిశీలిస్తూ అవసరమైనపుడు మరమ్మతులు చేయడం తన డ్యూటీ. చేరిన కొత్తలో సరిహద్దుల్లో రాత్రివేళల్లో ‘నైట్ విజన్ డివైజ్‌ను పరిశీలించాల్సిందిగా పురమాయించారు.
చాలా దూరం పెట్రోలింగ్ చేయాల్సి వచ్చేది. పైగా ఆ బృందంలో తనక్కొతే అమ్మాయి. ఒక్కోసారి 24 గంటలు డ్యూటీ ఉన్నప్పుడు వాష్‌రూం వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉండేది. సమీప గ్రామాల్లో ట్రక్కునాపి ఇళ్ళ తలుపుతట్టాల్సి వచ్చేది. ఆర్మీ డ్రస్‌లోఉన్న ఆర్చీని గ్రామీణులు వింతగా చూసేవారు. ఇంత శ్రమిస్తూనే పీజీ పూర్తి చేశారు.
ఇండియన్ ఆర్మీ దిల్లీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ విభాగంలో కొత్తగా వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు. కార్గిల్ యుద్ధానంతరం ప్రజలకు ఆర్మీ మరింత చేరువకావాలని నిర్ణయించుకుని ఈ కార్యక్రమం షురూ చేసింది. ఆర్చీ రెండేళ్ల కిందట ఈ విభాగ నిర్వహణ బాధ్యతలు స్వీకరించారు. ఈ వెబ్‌సైట్లోనూ, యూట్యూబ్‌లోనూ భారత సైనికుల గాథలు, వీరోచిత విజయాలు అన్నింటినీ పొందుపరుస్తున్నారు.
ఇవి నేరుగా ప్రజలకు చేరుతున్నాయి. జవాన్లు ఎంతగా శ్రమిస్తున్నారో, దేశంలో ఆర్మీ సేవలు ఎంత ప్రధానమైనవో, ఎంత పవిత్రమైనవో ప్రజలు తెలుసుకుంటున్నారు. ఈ స్ఫూర్తి యువత సైన్యంలో చేరడానికి తోడ్పాటునందిస్తుంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ఆర్మీలో చేర్పించేలా ఉత్తేజభరితంగా ఉంటోంది సమాచారం. ఇంతటి పవిత్ర బాధ్యతల్ని ఆర్చీ సమర్థంగా నిర్వహిస్తున్నారు.
ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలోంచి వచ్చిన అమ్మాయి, తండ్రిని పొగొట్టుకుని తల్లి పెంపకంలో పెరిగిన అమ్మాయి, అత్యంత సాహసోపేతమైన ఆర్మీలో చేరడం.. మొక్కవోని సంకల్ప బలంలో సర్వీసు కొనసాగించడం అబ్బురపరిచే విషయమే. అందుకే ఆర్చీ.. మేజర్ ఆర్చీ ఆచార్యగా ఎదగడానికి చాలా శ్రమించారు.. ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.