‘మహా’ ప్రతిష్టంభన తొలగిపోయింది. దాదాపు నెల రోజుల రాజకీయ డ్రామాకు తెర పడింది. దశాబ్దాలుగా శివసేన కంటున్న కలలు నిజమయ్యాయి. బీజేపీకి తోక పార్టీగా ఎన్నాళ్లు అని ప్రశ్నించుకునే శివసైనికులకు కొన్ని దశాబ్దాలు తరువాత సమాధానం దొరికింది. బాలా సాహెబ్ థాకరే రూపంలో చిన్న ఏరులా ప్రారంభమైన శివసేన ఇప్పుడు మహానదై సీఎం పీఠం మీద తన ఆదిపత్యాన్ని ప్రదర్శించనుంది. 27 జులై 1960లో జన్మించిన 59 ఏళ్ల ఉద్దవ్ థాకరే మహారాష్ట్ర సీఎం పీఠంపై కూర్చుని ఇక నిర్ణయాలు తీసుకోనున్నారు.
మరాఠా రాజకీయాల్లో ఎత్తులు పైఎత్తులను గెలిచి సీఎం పీఠంపై కూర్చుని మహారాష్ట్ర ప్రజల కోసం ఇక ఉద్దవ్ నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇప్పటి వరకు రాజకీయాలకు, తెర చాటు మంత్రాంగాలకు పరిమితమైన ఉద్దవ్ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలకు తెరలేపారు. ఇక నుంచి మాతో శ్రీ ముఖ్యమంత్రి నివాసంగా మారనుంది.

అనేక తర్జనభర్జనలు, అనేక సమాలోచనలు, అనేక మంత్రాంగాలు అనంతరం శివసేన – కాంగ్రెస్‌ – ఎన్సీపీ ఒక అవగాహనకు వచ్చాయి. రాజకీయంగా శివసేన ఒక దారి అయితే..కాంగ్రెస్ , ఎన్సీపీలది మరో దారి. శివసేన కరుడుగట్టిన హిందూ భావజాలంతో ఉంటే…కాంగ్రెస్‌, ఎన్సీపీ ఉదార రాజకీయాలు చేస్తాయి. అధికారం కోసం భిన్నదారుల్లో ఉన్న ముగ్గురు కలిశారని కచ్చితంగా చెప్పొచ్చు. అయితే..అదే అధికారం..ఆ అధికారంలో కూర్చొని తీసుకునే నిర్ణయాలు వీరి మధ్య మైత్రిని శాశ్వతంగా ఉంచుతాయా అనేది ప్రశ్న. శివసేన దూకుడు రాజకీయాలు చేసే పార్టీ..ఈ దూకుడు పాలనలో కూడా కనిపించే అవకాశముంది. కనీస ఉమ్మడి ప్రణాళికతో శివసేనకు కాంగ్రెస్ – ఎన్సీపీలు మూకుతాడు వేస్తాయా?.

బీజేపీని..చిరకాల స్నేహాన్ని కాదని కాంగ్రెస్ – ఎన్సీపీలతో కలిసి శివసేన ఎంత కాలం సంకీర్ణ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తుందో చూడాలి. నిర్ణయాల్లో హిందుత్వం కనిపిస్తే మద్దతు నిర్ణయాన్ని సమీక్షించుకుంటామని సోనియా గాంధీ ఇప్పటికే అల్టీమేటం ఇచ్చారు.
ప్రభుత్వ ఏర్పాటు లేటవుతుండటంతో.. సోనియా గాంధీపై శరద్ పవార్ పరోక్ష ఆగ్రహాన్ని కూడా ప్రదర్శించారు. సోనియా గాంధీని దారిలోకి తీసుకురావడానికి రైతులు సమస్యల పేరుతో ప్రధాని మోదీని కలిసి.. రాజకీయ చర్చలు కూడా జరిపారు. ఎప్పుడైతే ప్రధానితో పవార్‌ భేటీ అయ్యారో ..కాంగ్రెస్ అలర్ట్ అయింది. పవార్ చేజారితే మొదటికే మోసం అనుకుని పవార్ చెప్పినట్లు వినడం మొదలు పెట్టింది.

మహారాష్ట్ర అసెంబ్లీలో 288 సీట్లు ఉన్నాయి. బీజేపీ 105 సీట్లు గెల్చుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు గెల్చుకున్నాయి. మూడు పార్టీల సీట్లు కలిపితే.. 154 మంది ఎమ్మెల్యేలు వీరి చేతిలో ఉన్నట్లు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి కావాల్సింది 145 సీట్లు. అయితే…ఈ ప్రభుత్వం ఎన్నాళ్లు ఉంటుందనేది ప్రధాన ప్రశ్న. ఎందుకంటే..సిద్దాంతాలు తప్పి అధికారం కోసం పాకులాడిన పార్టీలు, ప్రభుత్వాలు చరిత్రలో ఎక్కువ కాలం మనలేదు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. సిద్దాంతాన్ని, భావజాలాన్ని మరిచి అధికారం కోసం బీజేపీని వదిలిన శివసేన..కొత్త మిత్రులతో ఎన్నాళ్లు స్నేహంగా ఉంటుందో కాలమే సమాధానం చెప్పాలి.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్