మహారాష్ట్ర ఎన్నికలు-ఆదిత్య అరంగేట్రం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Oct 2019 3:27 PM GMT
మహారాష్ట్ర ఎన్నికలు-ఆదిత్య అరంగేట్రం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వర్లి నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే పోటీ చేస్తుండడం వర్లి నియోజకవర్గాన్ని హాట్ టాపిక్‌గా మార్చేసింది. ఠాక్రేల వంశం నుంచి ఓ వ్యక్తి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. యువతలో మంచి క్రేజ్ ఉన్న ఆది త్య ఠాక్రే, ఫస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఐతే, ఆయన గెలుపుపై కాకుండా మెజార్టీపైనే చర్చ జరగడం విశేషం. ఎందుకంటే, వర్లి శివసేనకు కంచు కోట. శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేకు ఈ నియోజకవర్గంపై మంచి పట్టుంది. బాల్‌ఠాక్రే వారసత్వం ఆదిత్యకు పెట్టని కోట. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడం, ప్రజ లతో ఇట్టే కలిసిపోవడం ప్లస్ పాయింట్లు. అభివృద్ధి మంత్రం-మోదీ ఛరిష్మాలతో ఆదిత్య గెలుపు ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు. బీజేపీ–శిసేన కూట మి గెలిస్తే ఆదిత్యకు డిప్యూటీ సీఎం పోస్టు లభిస్తుందనే ప్రచారం జరుగుతోంది.

ఆదిత్స వర్సెస్ సురేష్ మానె:

ఆదిత్యకు ప్రత్యర్థిగా ఎన్సీపీ అభ్యర్థి సురేశ్‌ మానె పోటీలో ఉన్నారు. ఆయన స్థానిక దళిత నాయకుడు. దళిత వర్గాల్లో మంచి పట్టుంది. లోకల్ లీడర్ కావడం కలసివచ్చే అంశం. ఆయన కూడా లోకల్ ఫీలింగ్‌ను రెచ్చగొడుతున్నారు. పక్కా లోకల్ అన్న ప్రచారంతో ఆదిత్యకు గట్టి పోటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. స్థానికత-దళిత కార్డులను ఉపయోగిస్తూ ఓటర్లను ఆకర్షించడానికి ట్రై చేస్తున్నారు.

వర్లి నియోజకవర్గ పరిస్థితి:

వర్లి నియోజకవర్గం మినీ మహారాష్ట్రను తలపిస్తుంది. ఒకప్పుడు వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరైన వర్లి గత కొన్నేళ్లలో పూర్తిగా మారిపోయింది. ఆకాశహర్మ్యాలు, అధునాతన వాణిజ్య భవనాలు వచ్చాయి. వాటి పక్కనే మురికివాడల్లో ప్రజలూ ఉన్నారు. భిన్న కులాలు, మతాలు, విభిన్న భాషలతో వర్లీ భిన్నత్వంలో ఏకత్వా నికి ప్రతీకలా ఉంటుంది. మరాఠీ, గుజరాతీ, పంజాబీ, తెలుగు వారితోపాటు ఉర్దూ మాట్లాడే ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. భిన్న తరహా ఓటర్లను ఆకర్షించడం అంత ఈజీ కాదు. మరాఠీయేతరులను ఆకట్టుకోవడానికి శివసేన అభ్యర్థి ఆదిత్య ఠాక్రే తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. తమకు అందరూ సమానమే అంటూ కొత్త రాగం పాడుతున్నారు.

వర్లి-గత ఎన్నికల ఫలితాలు:

వర్లిలో గత ఫలితాలను పరిశీలిస్తే, 1990 నుంచి ఇప్పటి వరకు శివసేనదే రాజ్యం. ఇన్నేళ్లలో ఒకే ఒక్కసారి శివసేన ఓటమి పాలైంది. 1990 నుంచి 2004 ఎన్నికల వరకు శివసేన నుంచి దత్తాజీ తన్వాండే ఎన్నికయ్యారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థి సచిన్‌ ఆహిర్‌ గెలుపొందారు. రాజ్‌ ఠాక్రేకు చెందిన MNS పార్టీ ఓట్లు భారీగా చీల్చడంతో ఎన్సీపీ అభ్యర్థికి లాభం చేకూరింది. 2014లో శివసేన అభ్యర్థి సునీల్‌ షిండే గెలుపొందారు. మరి, తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ శివసేనే గెలుస్తుందా..? ఆదిత్యకు డిప్యూటీ సీఎం పోస్టు లభిస్తుందా..?

Next Story