కరోనా: 24 గంటల్లోనే 97 మంది మృతి.. తొలిసారిగా ఒకే రోజు ఒక్క రాష్ట్రంలో ఇన్ని మరణాలు
By సుభాష్ Published on 27 May 2020 11:05 AM GMTదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. కేసుల సంఖ్య పెరుగుతున్నాయి తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. అదే విధంగా మరణాల సంఖ్య కూడా బాగానే ఉంటుంది. ఇక మహారాష్ట్రలో మాత్రం కరోనా తీవ్ర స్థాయిలో ఉంది. కరోనా కేసుల్లో దేశంలోనే మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతోంది. మంగళవారం ఒక్క రోజే 97 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇంత మంది మరణించడం తొలిసారి
భారత్‌లో ఒక్క రోజు ఇంత మంది ఒక్క రాష్ట్రంలో కరోనా కాటుకు బలి కావడం ఇదే తొలిసారి. దీంతో ఆ రాష్ట్ర ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కాగా, మంగళవారం మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 2,091 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటిలో ఒక్క ముంబైలోనే 1,002 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 54,758కి చేరింది. ఇప్పటి వరకూ మరణాల సంఖ్య 1,792 చేరగా, అందులో ముంబైలోనే 1,065 మంది మృతి చెందడం గమనార్హం.