హీరో విశాల్‌కి నోటీసులు జారీ చేసిన మద్రాస్ హైకోర్టు.. ఎందుకంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Sep 2020 1:44 PM GMT
హీరో విశాల్‌కి నోటీసులు జారీ చేసిన మద్రాస్ హైకోర్టు.. ఎందుకంటే..?

హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. దర్శకుడు ఎం.ఎస్‌.ఆనంద్‌, విశాల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'చక్ర'. ఈ చిత్రాన్ని విశాల్‌ ఫిలింఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్‌ నిర్మిస్తున్నారు. దీపావళికి ఈ సినిమాను దక్షిణాది భాషల్లో ఓటీటీలో విడుదల చేయడానికి నిర్మాత విశాల్‌ నిర్ణయించుకున్నారు. అయితే 'చక్ర' సినిమా ఓటీటీ విడుదలను ఆపాలంటూ నిర్మాణ సంస్థ ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ హైకోర్టులో కేసు వేసింది. కేసును పరిశీలించిన మద్రాస్‌ హైకోర్టు విశాల్‌కు, డైరెక్టర్‌ ఆనందన్‌కు నోటీసులను జారీ చేసింది.

వివరాల్లోకెళ్తే.. విశాల్‌ హీరోగా సుందర్‌.సి దర్శకత్వంలో ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌ నిర్మించిన చిత్రం 'యాక్షన్'‌. రూ. 44 కోట్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రూ. 20 కోట్ల వరకు గ్యారెంట్ ఉండేలా నిర్మాణ సంస్థకు విశాల్ అగ్రిమెంట్ రాసిచ్చాడు. అయితే ఇరు తెలుగు రాష్ట్రాల్లో రూ. 4 కోట్లు, తమిళనాడులో రూ. 7.7 కోట్లు మాత్రమే ఈ చిత్రం వసూలు చేసింది. దీంతో తదుపరి చిత్రాన్ని ట్రైడెంట్ బ్యానర్ లోనే చేస్తానని విశాల్ హామీ ఇచ్చాడట. కానీ, తన సొంత బ్యానర్ లోనే విశాల్ సినిమాను నిర్మించారు. దీంతో ట్రైడెంట్ ఆర్ట్స్ హైకోర్టును ఆశ్రయించింది. తమకు విశాల్ రూ. 8.29 కోట్లు బాకీ ఉన్నాడని.. సినిమా విడుదలను ఆపాలని కోర్టును కోరింది. కేసును పరిశీలించిన కోర్టు విశాల్‌కు, డైరెక్టర్‌ ఆనంద్‌కు నోటీసులను జారీ చేసింది.

Next Story