మధ్య ప్రదేశ్‌ రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. బలపరీక్షకు కొద్దిగంటల ముందే కాంగ్రెస్‌ పార్టీ చేతులెత్తేసింది. తమ పార్టీకి తగినంత బలం లేదని భావించిన ఆ పార్టీ పెద్దలు బలపరీక్షకు ముందే ఓటమిని ఒప్పుకున్నారు. దీంతో సీఎంగా ఉన్న కమల్‌నాథ్‌ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 15 నెలల పాటు రాష్ట్రాభివృద్ధికోసం కష్టపడి పనిచేశామన్నారు. ఐదు సంవత్సరాలు పాలించమని ప్రజలు మాకు అవకాశం కల్పించారని అన్నారు. రైతులు మా ప్రభుత్వంపై ఎంతో విశ్వాసం ఉంచారని, వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేశామన్నారు. 20లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని, ప్రజల విశ్వాసానికి అనుకూలంగా పరిపాలించాలని భావించామని, కానీ మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భాజపా అన్ని ప్రయత్నాలు చేసిందని విమర్శించారు. ప్రజల నమ్మకాన్ని భాజపా వమ్ము చేసిందని, మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక కుట్రలు పన్నారని, మాఫియాకు వ్యతిరేకంగా పనిచేయడం భాజపాకు నచ్చలేదని కమల్‌నాథ్‌  విమర్శించారు. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్‌లో బీజేపీ గద్దెనెక్కడ లాంఛనంగా కనిపిస్తుంది. సీఎం కమల్‌నాథ్‌ రాజీనామాతో ఆమేరకు లైన్‌ క్లియర్‌ అయినట్లయింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సాయంత్రం మధ్య ప్రదేశ్‌ అసెంబ్లీలో బలపరీక్ష జరగనుంది..

అసలేం జరిగిందంటే..

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆయన వెంట కాంగ్రెస్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం  సంక్షోభంలో పడింది. ఈ నెల 16న అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కరోనా వైరస్‌ కారణంగా సమావేశాలు ప్రారంభమైన రోజే సభను అర్థాంతరంగా వాయిదా వేస్తూ స్పీకర్‌ ప్రజాప్రతిని నిర్ణయం తీసుకున్నారు. దీంతో కమల్‌నాథ్‌  ప్రభుత్వం మెజార్టీ కోల్పోయిందని.. మధ్య ప్రదేశ్‌ అసెంబ్లీలో వెంటనే బలపరీక్ష నిర్వహించాలంటూ మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, ఇతర బీజేపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు బల పరీక్ష నిర్వహించేందుకు శుక్రవారం 5గంటల వరకు డెడ్‌లైన్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా గురువారం మరో 16 మంది రాజీనామాల్ని స్పీకర్‌ ప్రజాప్రతిని ఆమోదించారు. దీంతో అధికార పీఠంపై కొనసాగేందుకు కావాల్సిన బలం లేకపోవటంతో కమల్‌నాథ్‌  రాజీనామా చేయడం అనివార్యమైంది.

ప్రస్తుత బలాబలాలు ఇలా..

మధ్య ప్రదేశ్‌ అసెంబ్లీలో 230 శాసనసభ స్థానాలున్నాయి.  228 మంది ఎమ్మెల్యేలున్నారు. రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు స్పీకర్‌ ఆమోదం పొందడంతో ఎమ్మెల్యేల సంఖ్య 206కు చేరింది. బలపరీక్షలో ఏ పార్టీ నెగ్గాలన్నా.. 104 మంది ఎమ్మెల్యేలు అవసరం. భాజపాకు 107 మంది సంఖ్యాబలం ఉంది. గతంలో 114 మంది సభ్యుల బలం ఉన్న కాంగ్రెస్‌ 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో 92కు చేరింది. మరో ఏడు మంది ఇతర పార్టీల సభ్యులు ఉన్నారు. వీరిలో ఎక్కువశాతం మంది బీజేపీకే మద్దతు పలుతున్నారు. దీంతో సాయంత్రం జరిగే బలపరీక్షలో బీజేపీ అధికార పీఠాన్ని దక్కించుకోవటం ఖాయంగా కనిపిస్తుంది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.