మీడియా పిచ్చుకపై ఏపీ ప్రభుత్వ బ్రహ్మాస్త్రం..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 Nov 2019 6:53 AM GMTఈ అక్టోబర్ 30 న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాలూకు సాధారణ పరిపాలనా విభాగం (సమాచార ప్రజా సంబంధాల) విభాగం జీవో ఆర్ టీ నం. 2430 ను జారీ చేసి, తప్పుడు కథనాలు, నిరాధార కథనాలు, ప్రతిష్ఠను భంగపరిచే కథనాలను పత్రికల్లో ప్రచురించినా, టెలికాస్ట్ చేసినా లేక సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా ఫిర్యాదులు నమోదు చేసి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా యథాయోగ్యమైన చట్టపరమైన కేసులు నమోదు చేసేందుకు వివిధ విభాగాల కార్యదర్శులకు అధికారాన్ని ధారాదత్తం చేసింది. ఈ జీవో జారీ చేస్తున్న సందర్భంలో ఫిబ్రవరి 20, 2007 నాటి జీవో ఆర్ టీ నం. 938 ను ఉటంకించడం కూడా జరిగింది.
గంపగుత్తగా అధికారం ధారాదత్తం
అంటే మీడియా పై నేరపూరిత పరువునష్టం కేసులు నమోదు చేసే పూర్తి అధికారాన్ని గంపగుత్తగా ధారాదత్తం చేయడం జరిగిందన్నమాట. “ రెండవ ఆర్టికల్ - కొన్ని పత్రికలు, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా మాధ్యమాలు దురుద్దేశంలో ప్రభుత్వం ప్రతిష్ఠను దిగజార్చేలా తప్పుడు, నిరాధారమైన, పరువు నష్టం కలిగించే వార్తలను కావాలనే ప్రచారం చేస్తున్న సంఘటనలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ప్రజలకు వాస్తవమైన, సత్యమైన సమాచారం చేరేలా , వీరిపై కేసులను చట్టంలోని సంబంధిత నిబంధనల మేరకు కేసులు నమోదు చేసేందుకు గాను సమాచార ప్రజా సంబంధాల శాఖ ప్రత్యేక కమీషనర్ కు అధికారాన్ని ఇవ్వడం జరిగింది..
మూడవ ఆర్టికల్ - “ అయితే, తమ తమ విభాగాల గురించి కూలంకషమైన పరిజ్ఞానం, తగు అధికారాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలలో సదరు వార్తా కథనాలు, పోస్టుల సత్యాసత్యాలను నిర్ధారించేందుకు అవసరమైన సదుపాయాలు ఉన్నందున, ఈ కథనాలకు జవాబులు ఇవ్వడానికి లేదా ఫిర్యాదులు దాఖలు చేయడానికి, అవసరమైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా చట్ట ప్రకారం కేసులు వేయడానికి వీలుంటుందని భావించడం జరిగింది.
నాలుగవ ఆర్టికల్ – ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించిన తరువాత ప్రభుత్వం ఇందుమూలంగా వివరణలను పంపించేందుకు ఆయా శాఖల కార్యదర్శులకు అనుమతిని ఇవ్వాలని నిర్ణయించింది. అవసరమైన చోట్ల ఫిర్యాదులు దాఖలు చేయడానికి, కేసులు నమోదు చేయడానికి, అవసమైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ల ద్వారా ప్రింట్/ ఎలక్ట్రానిక్/ సోషల్ మీడియాలలో ప్రచురితమైన/టెలికాస్ట్ అయిన/ పోస్ట్ అయిన అప్రతిష్టాకరమైన వార్తా కథనాలపై న్యాయపరమైన అంశాల పరిశీలన అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకోవాడానికి అనుమతిని ఇవ్వడమైనది.
అయిదు - ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియల్ లోని వివిధ విభాగాల స్పెషల్ సెక్రటరీలు/ ప్రిన్సిపల్ సెక్రటరీలు/ సెక్రటరీలు తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోగలరు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆదేశాల మేరకు, వారి పేరిట ఈ ఆదేశాలను జారీ చేయడమైనది. ఈ జీవో పై ప్రభుత్వం సమాచార ప్రజా సంబంధాల శాఖ ఎక్స్ అఫీషియో స్పెషల్ సెక్రటరీ టీ విజయకుమార్ రెడ్డి సంతకం చేయడమైనది.
మీడియా పట్ల ప్రభుత్వ దృక్పథం
ఈ జీవోను జాగ్రత్తగా పరిశీలిస్తే మీడియా పట్ల ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలుస్తుంది. దీని నుంచి అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇవిః
(అ) ప్రభుత్వం ప్రింట్, ఎలక్ట్రానిక్స్ లేదా సోషల్ మీడియా సహా అన్ని రకాల మీడియాను వదల దలచుకోలేదు. ఆ రెండు పత్రికలు మాత్రమే కాదు, ఎవరినీ విడిచిపెట్టదలచుకోలేదు.
(ఆ) ప్రభుత్వం కొన్ని మీడియా సంస్థలు దురుద్దేశపూరితంగా నిరాధారమైన, అసత్య వార్తలు, ప్రతిష్ఠను భంగం చేసే వార్తలను ప్రచురిస్తున్నాయని నమ్ముతోంది.
(ఇ) 2007 జీవోలో కేవలం సమాచార ప్రజా సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ మాత్రమే క్రిమినల్ పరువు నష్టం దావా వేయవచ్చు. కానీ ఈ జీవో ప్రభుత్వ సచివాలయంలోని వివిధ విభాగాల స్పెషల్ సెక్రటరీలు/ ప్రిన్సిపల్ సెక్రటరీలు/ సెక్రటరీలు క్రిమినల్ కేసులు పెట్టవచ్చు.
(ఈ) తమ తమ విభాగాల గురించి కూలంకషమైన పరిజ్ఞానం, తగు అధికారాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలలో సదరు వార్తా కథనాలు, పోస్టుల సత్యాసత్యాలను నిర్ధారించేందుకు అవసరమైన సదుపాయాలు ఉన్నందున, వారు క్రిమినల్ పరువునష్టం కేసులు వేయవచ్చునని జీవో చెబుతోంది. వారు తప్పుడు సమాచారాన్ని ఖండిస్తూ వివరణలు ఇవ్వడానికి, సంజాయిషీలు ఇవ్వడానికి, పూర్తి సమాచారం ఇవ్వడానికి, స్పష్టీకరణలు ఇవ్వడానికి అధికారాన్ని పొంది ఉన్నారన్న అంశం పై దృష్టి పెట్టనందువల్లే ప్రభుత్వ ఆలోచనలపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
(ఉ) ఈ జీవో ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చే కథనాల విషయంలో జర్నలిస్టులను ప్రాసిక్యూట్ చేసే అధికారాన్ని ఈ జీవో ద్వారా ప్రభుత్వం అధికారులకు ఇస్తోందన్నది పై అంశాల నుంచి అర్థమౌతోంది.
చట్టపరమైన ప్రక్రియ
నిజానికి ఒక వేళ ఒక వార్తా కథనం తప్పుడు ఆరోపణలతో తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తుందని ఏ ప్రజా సేవకుడైనా భావిస్తే ఆయన ముందుగా సదరు మీడియాపై చట్టపరమైన చర్యలను తీసుకునేందుకు, క్రిమినల్ పరువు నష్టం కేసులు దాఖలు చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతిని కోరుతూ దరఖాస్తు చేసుకోవాలి. ఈ కేసును అధికారులు, నిపుణులు, న్యాయవ్యవమారాల నిపుణులు అధ్యయనం చేసి, తగిన కారణాలున్నాయని భావిస్తే అనుమతిని ఇవ్వడం జరుగుతుంది. వాస్తవానికి ఈ ప్రక్రియను పాటించాలి. కానీ ఈ జీవో ఈ మొత్తం ప్రక్రియను పూర్వపక్షం చేసి, ప్రతి ఆపీసర్ తనకు సంక్రమించిన ప్రత్యేక అధికారాలతో పాత్రికేయులపై కేసులు పెట్టవచ్చు.
జర్నలిస్టులపై క్రిమినల్ కేసులా?
ప్రభుత్వం ఎడిటర్లు, పబ్లిషర్లపై పరువునష్టం కేసులు ఎందుకు వేయాలనుకుంటోందన్నదే అసలు ప్రశ్న. అసలు పరువునష్టం ఏమిటి? పరువు నష్టం విషయంలో ఫిర్యాదు ఎవరు చేయగలరు?
ప్రజా సేవకుడు (ముఖ్యమంత్రి, మంత్రి, అధికారి లేదా ఎమ్మెల్యే) పై నిరాధారమైన అవినీతి ఆరోపణలు వేసినా, ప్రభుత్వ కాంట్రాక్టు లేదా వ్యయం నుంచి అక్రమంగా లబ్దిపొందినట్టు అసత్య ఆరోపణలు చేసినా, ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా క్రిమినల్ పరువు నష్టం దావా వేసేందుకు అనుమతిని కోరవచ్చు. ప్రభుత్వం లేదా అందులోని ఒక విభాగం పరువునష్టం దావా వేయలేవు. ఎందుకంటే పరువు అనేది వ్యక్తులకు ఉంటుంది. ప్రభుత్వాలకు, విభాగాలకు కాదు. ప్రభుత్వంలోని తప్పులను, లోపాలను ఎత్తి చూపడం పరువు నష్టం కాదు. అదే విధంగా ఒక వార్తా కథనం వల్ల ఒక ప్రజా సేవకుడి వ్యక్తిగత పరువుకు భంగం కలిగిందా లేదా అన్న విషయాన్ని రూఢి చేసుకోకుండా పాత్రికీయులను ప్రాసిక్యూట్ చేయడానికి ప్రభుత్వం ఎలా అనుమతించగలదన్న ప్రశ్న తలెత్తుతుంది.
ఇవి ఈ జీవోలో మౌలికంగా ఉన్న చట్టపరమైన లోపాలు. కానీ వీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం గుర్తించలేదు. నిజానికి ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ ను కానీ, సలహాదార్లను కానీ, మీడియా మిత్రులను కానీ న్యాయ శాఖ కార్యదర్శిని కానీ సంప్రదించిందా లేదా అన్నది తెలియడం లేదు. ఒక వేళ సంప్రదిస్తే వారు సరైన సలహానే ఇచ్చారా అన్నది ప్రశ్న!!
ప్రజాధనంతో పనిచేస్తున్న వారిని విమర్శించడం వారి ప్రతిష్టకు భంగకరం కాదు. మీడియా అసెంబ్లీలో విపక్షంలాగా ప్రభుత్వ చర్యలను విమర్శించాల్సిందే. ఒకవేళ రాజకీయ ప్రయోజనాలతో విపక్షం మౌనంగా కూర్చున్నా, మీడియా విపక్ష పాత్రను పోషంచి, ప్రభుత్వ నిర్ణయాలపై తర్కించాల్సిందే. నేడు మీడియా రంగంలో ఒక వర్గం రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తోంది. నిస్పాక్షికంగా వ్యవహరించడం లేదు. రాజకీయ, వాణిజ్య ప్రయోజనాలతోనే వార్తలను వండి వారుస్తోంది. అయినప్పటికీ ఒక పత్రిక ప్రభుత్వం/ అధికార పక్షం/ దాని నేతలను అసత్యపూరితమైన, నిరాధారమైన ఆరోపణలతో వార్తలు వెలువరిస్తున్నా, అవి ప్రతిష్ఠకు భంగం కలిగించినప్పుడు మాత్రమే ఎడిటర్ ను ప్రాసిక్యూట్ చేయాలి. కేవలం వ్యతిరేక కథనాలు వచ్చినంత మాత్రాన పరువునష్టం దావా వర్తించదు. జర్నలిస్టులపై పరువునష్టం దావా వేసే అధికారం ప్రభుత్వం వద్ద ఉండటం ప్రజాస్వామ్య వ్యతిరేకం. ఇది పత్రికా స్వేచ్ఛకు భంగకరం. పలు ప్రజాస్వామ్య దేశాల్లో క్రిమినలు పరువు నష్టం కేసులు దాఖలు చేయడాన్ని తొలగించారు. కానీ మన దేశంలో మాత్రం విమర్శను అడ్డుకునేందుకు అధికార పక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వం తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందనడానికి ఈ జీవో తార్కాణం.
ఒక వేళ పత్రిక నిస్పాక్షికంగా వ్యవహరించకుండా, ఒక పార్టీ లేదా కులానికి కొమ్ముకాసినప్పటికీ, దానికి అభివ్యక్తి స్వాతంత్ర్యం ఉంటుంది. పక్షపాతపూరితంగా వ్యవహరించడం అనైతికం. కానీ ఆ కారణంగా దాని పై చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. ఇలాంటి సందర్భాల్లో ఒక పత్రిక పక్షపాతపూరితంగా వ్యవహరిస్తే ఇంకో పత్రిక ద్వారా మాత్రమే దానిని ఎదుర్కోవాలి. ఒక పక్షపాత పూరిత పత్రిక ఇంకో పక్షపాత పూరిత పత్రికను విమర్శించలేదు. ఇదే ఈ సమస్యకు సమాధానం. ఈ సత్యాన్ని విస్మరించలేము.
అభివ్యక్తి స్వాతంత్ర్యం ప్రజల మౌలిక హక్కు. విమర్శించడం ప్రాథమిక హక్కు మాత్రమే కాదు. అది ఒక ప్రజాస్వామ్య అవసరత కూడా.
- ప్రొ.ఎం. శ్రీధర్ ఆచార్యులు