భరించేవాడే భర్త - హస్బెండ్ అఫ్ ది ఇయర్..!

By జ్యోత్స్న  Published on  14 Dec 2019 3:05 AM GMT
భరించేవాడే భర్త - హస్బెండ్ అఫ్ ది ఇయర్..!

భర్త అంటే భరించేవాడు. సరదాగా చెప్పే మాట కాదిది నిజం. కావాలంటే ఈ వీడియో చూడండి. గర్భవతి అయిన భార్య కోసం ఓ భర్త చేసిన పని ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. చైనాలోని హెగాంగ్‌లో హెయిలాంగ్‌జింగ్‌ ప్రావిన్సుకు చెందిన ఒక మహిళ గర్భం దాల్చింది. భార్యను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకొచ్చాడు ఆమె భర్త. డాక్టరు రావటానికి కొంత సమయం ఉండటంతో వారిని వేచి చూడమని సిబ్బంది చెప్పారు. అయితే అప్పటికే అక్కడ ఉన్న కుర్చీలన్నీ ఇతర పేషంట్లతో నిండిపోయాయి. అలసటగా ఉన్న ఆమె కూర్చోవడానికి అక్కడ ఒక్క కుర్చీ కూడా లేదు. దీంతో భర్త తనే కుర్చీలా మారాడు.

భర్త కింద కూర్చోగా భార్య అతని వీపుపైన కూర్చొని అలసట తీర్చుకొంది. ఈ ఘటన మొత్తాన్ని అక్కడున్నవారు చూస్తున్నారే తప్ప ఒక్కరు కూడా లేచి ఆమెకు సీటు ఇచ్చిన పాపాన పోలేదు. దీనికి సంబంధించిన వీడియోను చైనా పోలీసులు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. అక్కడున్న వారి తీరును తప్పుబట్టారు. కారేషు దాసి అంటూ భార్య భర్తకు సేవకురాలిగా మారటమే చూసాం గానీ భర్తే భార్యకోసం సేవకుడిగా మారిన ఈ వీడియోని నాలుగు లక్షల మందికి పైగా వీక్షించారు. ఎదుటివారికి సహాయం చేయ్యాలన్న ఆలోచనే లేని చుట్టుపక్కల వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు, భర్తను అభినందిస్తూ అతనికి ‘హస్బెండ్ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు ఇవ్వాలని కామెంట్లు పెడుతున్నారు.Next Story