అడవిలో ప్రేమజంట ఆత్మహత్య.. ఎముకలు తప్ప మరేమీ..
By తోట వంశీ కుమార్ Published on 2 May 2020 6:23 PM IST
వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ప్రేమ జంట ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారు ఉరివేసుకుని నెలరోజులకు పైగానే అయినా.. లాక్‌డౌన్ కారణంగా అటువైపు ఎవరు వెళ్లకపోవడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి వెళ్లి చూడగా.. ఓ చెట్టుకు గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలు ఉన్నాయి. రెండు మృతదేహాలకు తలలు తప్ప మరేమీలేవు. కుళ్లిపోయి ఎముకలు మాత్రమే కనిపిస్తున్నాయి. వీరిద్దరు ఆత్మహత్యకు పాల్పడి సుమారు నెల రోజులు కావొస్తుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతదేహాలు ఉన్న ప్రాంతంలో టీఎస్ 34 సి 1952 అనే నెంబర్ గల ద్విచక్రవాహానం ఉంది. ఆ వాహానం పై మోక్ష అని రాసి ఉంది. పక్కనే సెల్‌ఫోన్లు పడి ఉన్నాయి.
మృతులను వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి మండలం కోట్‌పల్లి గ్రామానికి చెందిన శివలీల, మహేందర్‌లుగా పోలీసులు గుర్తించారు. వారిద్దరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే.. వారిద్దరు నిజంగానే ఆత్మహత్యకు పాల్పడ్డారా..? లేక ఎవరైనా వారిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.