పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తాడేపల్లిగూడెం నుంచి తణుకు వెళ్లే జాతీయ రహదారిపై లారీ అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్‌, క్లీనర్‌ సజీవ దహనమయ్యారు. స్థానికల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి మంటలను అదుపు చేశారు. మంటలు వ్యాపించిన సమయంలో డ్రైవర్‌, క్లీనర్‌ తప్పించుకునే అవకాశం లేకపోవడంతో సజీవ దహనమయ్యారు.

లాక్‌డౌన్‌ కారణంగా రోడ్డుపై ఎలాంటి వాహనాలు లేకపోవడంతో అతివేగంగా వెళ్లడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. అయితే లారీలో స్పిరిట్ తరలిస్తున్నట్లు తెలుస్తోంది. స్పిరిట్ ఉన్న కారణంగా మంటలు మరింత వ్యాపించాయి.

కాగా, లాక్‌డౌన్‌ ఉన్న నేపథ్యంలో అత్యవసర సేవల కోసం గూడ్స్‌ వాహనాలకు మాత్రమే అనుమతి ఉంది. దీంతో రోడ్డు ప్రమాదాలు కూడా చాలా వరకూ తగ్గిపోవడమే కాకుండా కాలుష్యం సైతం తగ్గిపోయింది. ఈనెల 20వ తేదీ తర్వాత గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్‌లలో కొంతమేర లాక్‌డౌన్‌ను సడలించి పబ్లిక్‌ ట్రాన్స్‌ పోర్టును అనుమతించనున్నారు. అలాగే వ్యవసాయనికి సంబంధించిన ఉత్పత్తుల రవాణా వాహనాలకు కూడా అనుమతి ఇవ్వనున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.