పాతబస్తీలో ఓ మహిళ కిడ్నాప్‌ యత్నించిన విషయం తెలిసిందే. ఇక తాజా వివరాల ప్రకారం.. అదనపు కట్నం కోసమే కట్టుకున్న భార్యను భర్త కిడ్నాప్‌కు యత్నించినట్లు తెలుస్తోంది. మాసబ్‌ ట్యాంక్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది.

వివరాల్లోకి వెళితే.. మహ్మద్‌ షరీఫ్‌ అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు. ఒక కుమార్తెకు వివాహం కాగా,  2014లో రెండో కుమార్తె అస్మాని సల్మాన్‌ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. కొన్ని రోజులు బాగానే ఉన్నా.. తర్వాత సల్మాన్‌ అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్నాడు. అల్లుడి వేధింపులపై గతంలో కూడా బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో భర్త వేధింపులు తట్టుకోలేక ఆమె పిల్లలతో కలిసి పుట్టింటికి వచ్చింది. కాగా, అస్మా తండ్రి షరీఫ్‌తో ఆస్పత్రికి వెళ్తుండగా, సల్మాన్ తన స్నేహితులతో కారులో వచ్చి కిడ్నాప్‌ చేసేందుకు యత్నించాడు.

మామపై కక్ష పెంచుకున్న అల్లుడు దాడి చేసేందుకు యత్నించాడని షరీఫ్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నా కుమార్తెను కిడ్నాప్‌ చేసి భయపెట్టేందుకే నాపై దాడికి దిగాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. షరీఫ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.