నేపాల్‌ ప్రధాని సంచలన వ్యాఖ్యలు.. శ్రీరాముడు భారతీయుడు కాదు.. నేపాలీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 July 2020 2:31 AM GMT
నేపాల్‌ ప్రధాని సంచలన వ్యాఖ్యలు.. శ్రీరాముడు భారతీయుడు కాదు.. నేపాలీ

నేపాల్ ప్రధాన మంత్రి కెపి శర్మ ఓలి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులంతా కొలిచే శ్రీరాముడు నేపాలీ అని.. భారతదేశానికి చెందిన వ్యక్తి కాదని అన్నారు. రాముడి జన్మస్థానం అయోధ్య అని కొన్ని కోట్ల మంది హిందువులు విశ్వసిస్తారని.. ఆ అయోధ్య నేపాల్ లోని ఖాట్మండు దగ్గర ఉన్న చిన్న గ్రామమని సోమవారం నాడు వ్యాఖ్యలు చేశారు కెపి శర్మ. శ్రీరాముడు నేపాలీ అని చెప్పుకొచ్చారు.

ఆయన ఇంట్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో మాట్లాడిన కెపి ఓలి.. భారత్‌లో ఉన్నది నకిలీ అయోధ్య అని అన్నారు. రాముడి జన్మభూమి తమదని చెప్పుకుంటూ భారతదేశం సాంస్కృతిక దోపిడీకి పాల్పడుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. సైన్స్ లో నేపాల్ చేస్తున్న కృషిని కూడా తక్కువ చేశారని ఆయన అన్నారు.

'సీతమ్మను ఇచ్చింది తామేనని మనం నమ్ముతూ వస్తున్నాం.. శ్రీరాముడ్ని ఇచ్చింది కూడా మనమే.. భారత్ కు చెందిన అయోధ్యకు చెందిన వారు కాదు శ్రీరాముడు. బిర్గంజ్ దగ్గర ఉన్న గ్రామమే నిజమైన అయోధ్య' అని చెప్పుకొచ్చారు. నిజాలన్నీ బయటకు రావాల్సిన సమయం వచ్చిందని అన్నారు.

ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ కూడా కెపి శర్మ ఓలి చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ లో పోస్టు పెట్టింది. 'నిజమైన అయోధ్య నేపాల్ లో ఉంది. శ్రీరాముడు నేపాలీ.. భారతీయుడు కాదు' అన్నట్లు నేపాలీ మీడియాలో చెప్పారని తెలిపింది.

అయోధ్య ఉత్తరప్రదేశ్ లోని టౌన్.. లక్నోకు 135 కిలోమీటర్ల దూరంలో ఉంది.

భారత్ కు చెందిన భూభాగం తమదంటూ ఇటీవలే నేపాల్ సరికొత్త మ్యాప్ ను తయారు చేసింది. లిపులేఖ్, కాలాపాని ప్రాంతాలు తమ భూభాగాలని నేపాల్ ప్రభుత్వం తాజాగా కొత్త వాదనను ముందుకేసుకుంది. నేపాల్ పార్లమెంట్ కూడా ఆ భూభాగాలు తమవేనని చెప్పుకొచ్చింది.. నేషనల్ అసెంబ్లీ కూడా బిల్ ను పాస్ చేసింది. భారత్ కు ఈ ప్రాంతాలు ఎంతో కీలకమైనవి.. 1962 యుద్ధం తర్వాత భారత్ వీటి దగ్గర ఎంతో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. నేపాల్ చేస్తున్న పనులపై భారత్ ధీటుగా బదులిచ్చింది. భారత్ భూభాగంపై నేపాల్ కు ఎటువంటి హక్కులూ లేవని.. హద్దులు దాటకండంటూ వార్నింగ్ ఇచ్చింది.

మే నెలలో కూడా భారత్ పై అక్కసు వెళ్లగక్కాడు నేపాల్ ప్రైమ్ మినిస్టర్ ఓలి. నేపాల్ లో కరోనా వైరస్ విపరీతంగా పెరగడానికి కారణం భారతే అని ఆరోపించాడు. భారత్ నుండి నేపాల్ లోకి ఎక్కువ మంది వస్తున్నారని అందుకే తమ దేశంలో కరోనా పెరిగిపోతోందని.. చైనీస్, ఇటాలియన్ వైరస్ ల కంటే ఇండియన్ వైరస్ ఎక్కువ ప్రమాదకారి అంటూ నోటికొచ్చిన వ్యాఖ్యలు చేశారు కెపి శర్మ ఓలి. చైనా అండ చూసుకునే నేపాల్ రెచ్చిపోతోందని పలువురు చెబుతున్నారు. వైద్యులకు కనీసం పిపిఈ కిట్లు కూడా ఇవ్వలేదు, సరిగా టెస్టులు కూడా నిర్వహించడం లేదని నేపాల్ వ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేసిన ఘటనలు ఉన్నాయి. తన తప్పులు కప్పి పుచ్చుకోడానికే కెపి శర్మ ఓలి ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారన్నది అందరికీ అర్థమవుతోంది.

Next Story