కోవిద్-19 పార్టీకి హాజరైన అమెరికన్.. ఆ తర్వాత ఏమైందంటే..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 July 2020 7:20 AM GMT
కోవిద్-19 పార్టీకి హాజరైన అమెరికన్.. ఆ తర్వాత ఏమైందంటే..?

న్యూ యార్క్: 30 సంవత్సరాల టెక్సాస్ కు చెందిన వ్యక్తి కరోనా వైరస్ కారణంగా మరణించాడు. అతడు మరణించడానికి కారణం కోవిద్-19 పార్టీకి హాజరవ్వడమే.. ఇంతకూ ఈ పార్టీ ఏమిటనే కదా..? కోవిద్-19 బారినపడిన ఓ వ్యక్తి ఓ పార్టీ ఇచ్చాడు.. ఆ పార్టీకి ఈ వ్యక్తి కూడా హాజరయ్యాడు. తీరా ఇతడికి కూడా కరోనా వైరస్ సోకడంతో ప్రాణాలు వదిలాడు. యువత కూడా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని అమెరికాకు చెందిన వైద్య నిపుణులు చెబుతూ ఉన్నారు.

శాన్ ఆంటోనియో, మెథడిస్ట్ ఆసుపత్రికి చెందిన జేన్ ఆపిల్బై మాట్లాడుతూ పార్టీకి హాజరై చనిపోయిన 30 సంవత్సరాల వ్యక్తి కరోనా వైరస్ అన్నది అసలు లేదని, ఇది కేవలం గాలి వార్త మాత్రమేనని ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చాడట. అందుకే అతడు కేర్ లెస్ గా పార్టీకి హాజరయ్యాడని తెలిపారు. 135000 మందికి పైగా అమెరికాలో మృత్యువాత పడ్డారు అయినా కూడా అతడు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కరోనా బారిన పడ్డాడు. పార్టీకి హాజరైన వారిలో చాలా మందికి కరోనా వైరస్ సోకింది.. వారు కూడా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. చనిపోతున్న సమయంలో ఆ 30 సంవత్సరాల వ్యక్తి నర్సుతో మాట్లాడుతూ 'నేను తప్పు చేశానని నాకు అర్థమవుతోంది' అని చెప్పాడట.

ఆ వ్యక్తి కరోనా వైరస్ ను గాలివార్తగా భావించడమే కాకుండా.. తాను యుక్త వయసులో ఉన్నానని.. కరోనా తననేమీ చేయదని అనుకున్నాడు. కానీ కరోనా అతడి ప్రాణాలను తీసింది. యుక్త వయసులో ఉన్న వాళ్లు కరోనా తమనేమీ చేయలేదని అనుకుంటుంటారని.. అయితే అది చాలా తప్పని వైద్య నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. వారు చాలా బాగున్నామని అనుకుంటున్నారని.. కానీ ల్యాబ్ టెస్టుల్లో ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయని అన్నారు. కరోనా వైరస్ యుక్త వయసులో ఉన్న వారిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. యువత ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని పలువురు సూచిస్తూ ఉన్నారు.

అమెరికాలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండడానికి యువత కారణమని చెబుతూ ఉన్నారు. యువత పార్టీలంటూ ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడంతో కరోనా కేసులు అధికమవుతూ ఉన్నాయి. ఇక ట్రంప్ ప్రభుత్వం కూడా త్వరలో స్కూల్స్ ను ఓపెన్ చేయాలని భావిస్తోంది. కరోనా కేసుల ప్రభావం ఉన్నప్పటికీ రాబోయే నెలల్లో స్కూల్స్ ను ఓపెన్ చేయాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భావిస్తోంది. యువత కారణంగా ఫ్లోరిడాలో అనూహ్యంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. కరోనా వైరస్ కారణంగా చనిపోతున్న వారి సంఖ్య అమెరికాలోనే అత్యధికం.

Next Story