ఒక్కసారిగా అల్లకల్లోలం.. వందల మంది షాపులపై పడి లూఠీ చేసేశారు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Jun 2020 3:32 PM GMT
ఒక్కసారిగా అల్లకల్లోలం.. వందల మంది షాపులపై పడి లూఠీ చేసేశారు..!

జెర్మనీ లోని స్టట్గార్ట్ నగరంలో ఒక్క సారిగా అల్లకల్లోలం జరిగింది. ఆదివారం నాడు వందల మంది ప్రజలను పోలీసుల మీద దాడి చేస్తూ షాపుల అద్దాలు పగులగొడుతూ లూఠీలకు పాల్పడ్డారు. షాపుల్లోని వస్తువులను అందినకాడికి దోచుకుని వెళ్లారు. అనూహ్య ఘటనతో పోలీసులు కూడా షాక్ కు గురయ్యాయి.

పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ మొదలుపెట్టారు. 20 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి నుండి సమాచారాన్ని సేకరిస్తున్నామని సౌత్ వెస్ట్రన్ నగర పోలీసులు స్టేట్మెంట్ ను విడుదల చేశారు. డజనుకు పైగా పోలీసులు ఈ దాడిలో గాయపడ్డారు. ఈ గొడవలు ఎందుకు జరిగాయో అన్నది కూడా పోలీసులు అంచనాకు రాలేకపోతున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని కూడా భయపడుతూ ఉన్నారు. ఉన్నతాధికారులు ఈ ఘటనలను ఖండించారు. సివిల్ వార్ లాంటి ఘటనల్లా తమకు అనిపించాయని అక్కడి రాజకీయనాయకులు చెప్పుకొచ్చారు.

నగరం లోని స్క్లోస్ప్లాట్జ్ ప్రాంతంలో డ్రగ్స్ ఉన్నాయన్న అనుమానాలతో పోలీసులు చెకింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇంతలో కొందరు పోలీసుల మీదకు ఎదురుతిరిగారు. వారి దగ్గర ఉన్న కట్టెలతో, ఇనుపరాడ్లతో పోలీసులపై దాడికి పాల్పడ్డారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. అలా నగరంలోని ఓ భాగంలో లూఠీలు చేయడం మొదలుపెట్టారు ఆందోళనకారులు. 500 మందికి పైగా ఆందోళనకారులు ఒక్కసారిగా తిరగబడడంతో పోలీసులు షాక్ కు గురయ్యారు.

మరికొన్ని బలగాలను రప్పించే సమయానికి పరిస్థితి బాగా చేజారిపోయింది. కొన్ని గంటల తర్వాత కానీ లూఠీలు ఆగలేదు. షాపుల అద్దాలను ధ్వంసం చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆభరణాల షాపును పూర్తిగా లూఠీ చేసేశారు. కొన్ని స్టోర్లలోని వస్తువులను తీసుకుని వెళ్లిపోయారు. గతవారం కూడా పోలీసులు, కొందరు యువకులకు మధ్య చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. కానీ ఈసారి పెద్ద ఎత్తున పోలీసులపై ఆందోళనకారులు తిరగబడ్డంతో ఆ ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించారు.

Next Story
Share it