తిరుమల శ్రీవారి దర్శనంపై కొత్త విధానం..!

By సుభాష్  Published on  18 May 2020 8:45 AM GMT
తిరుమల శ్రీవారి దర్శనంపై కొత్త విధానం..!

ముఖ్యాంశాలు

  • రోజుకు ఏడు వేల మందికి మాత్రమే దర్శనం

  • ముందుగా తిరుమల ఉద్యోగులకు, తిరుమల స్థానికులతో ప్రయోగం

  • ఈనెల 28 తర్వాత వెల్లడించనున్న తిరుమల నిర్ణయాలు

  • తిరుమల దర్శనాలపై కొత్త విధానం

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ ఆలయాల దర్శనాలపై పడింది. ఇక లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన తిరుమల దర్శనాలను పునః ప్రారంభించేందుకు తిరుమల తిరుపతిదేవస్థానం ప్రయత్నాలు చేస్తోంది. ఇందు కోసం కొత్త విధి విధానాలను రూపొందించనుంది. భక్తులను ఆలయంలోకి అనుమతించే విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చేలోగా ముందుస్తు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈనెల 28న ప్రత్యేక సమావేశం కానున్న టీటీడీ పాలక మండలి.. పలు కీలక నిర్ణయాలను తీసుకోనుందని సమాచారం.

దర్శనాలపై కొత్త విధానం

ఇక శ్రీవారి దర్శనాలపై కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా టీటీడీ ఉద్యోగులతో ప్రారంభించాలని టీటీడీ బోర్డు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా 500 మంది చొప్పున దర్శనాలను అనుమతించాలని, ఆపై తిరుమల, తిరుపతిలోని స్థానికులకు 10 నుంచి 15 రోజుల పాటు స్వామి వారి దర్శనం చేయించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తిరుమలలో రోజులో మొత్తం 14 గంటల పాటు స్వామి దర్శనానికి సమయం ఉండగా, భక్తుల సంఖ్యను ఏడువేలకు దాటకుండా చూడాలని, అంతేకాదు భౌతిక దూరాన్ని పాటిస్తూ దర్శనాలు కల్పించాలని అధికారులు చెబుతున్నారు.

టికెట్లు కేటాయించేందుకు స్లాట్ల విధానం:

తిరుమల దర్శనం కల్పించేందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాగానే దర్శన టికెట్లను ఆన్‌లైన్‌ లో కేటాయించేందుకు స్లాట్ల విధానాన్ని కూడా సిద్ధం చేశారు. ఇక టికెట్లు ఉన్నవారికి మాత్రమే అలిపిరి నుంచి కొండపైకి అనుమతిస్తారు. అలాగే ప్రతి భక్తుడికి అలిపిరి వద్ద థర్మల్‌ స్కానింగ్‌, శానిటైజేషన్ తప్పనిసరి చేయనున్నారు. నడక మార్గాల్లోనూ ఇదే పద్దతిని అనుస్తారు. ఇక భక్తులు విధిగా మాస్కులు, గ్లౌజులు ధరించాల్సి ఉంటుంది. అయితే ఈనెల 28న జరిగే పాలక మండలి సమావేశం తర్వాత వారి నిర్ణయాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

Next Story