లాక్‌డౌన్‌: రంగంలోకి ఆర్మీని దింపండి: సుప్రీంలో పిటిషన్‌ దాఖలు

By సుభాష్  Published on  20 April 2020 7:28 AM GMT
లాక్‌డౌన్‌: రంగంలోకి ఆర్మీని దింపండి: సుప్రీంలో పిటిషన్‌ దాఖలు

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తున్నారని, లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలయ్యేలా అన్ని రాష్ట్రాల్లో ఆర్మీని రంగంలోకి దింపాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈ పిటిషన్‌ను ముంబైకి చెందిన సామాజిక కార్యకర్త తరపున న్యాయవాదులు ఓంప్రకాశ్‌, దుష్యంత్‌లు పిటిషన్‌ దాఖలు చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా పలు రాష్ట్రాల్లో కూడా వైద్య సిబ్బందిపై దాడులకు తెగబడుతున్నారని, అంతేకాదు మతపరమైన సమావేశాలు కూడా జరుగుతుండటంతో కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని పిటిషన్‌లో కోరారు.

అలాగే ఈనెల 14న ముంబైలో వలస కూలీలు పెద్ద ఎత్తున గుమిగూడటం, ఇక కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి నిబంధనలకు విరుద్దంగా వివాహ కార్యక్రమం నిర్వహించడం తదితర అంశాలను పిటిషన్‌లో పొందుపర్చారు. లాక్‌డౌన్‌ ఉల్లంఘన దృష్ట్యా ఆర్మీని రంగంలోకి దింపేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌లో కోరారు.

Next Story