మే 4 తర్వాత లాక్‌డౌన్ రూల్స్ మార్పు..!
By సుభాష్ Published on 30 April 2020 9:48 AM ISTదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కాలరాస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీంతో ప్రజలెవ్వరు బయటకురాకుండా ఇళ్లకే పరిమితం అయ్యారు. ముందుగా ఏప్రిల్ 14 వరకు ఉన్న లాక్‌డౌన్.. మే 3 వరకూ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో మే 7 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించింది. ఇక లాక్‌డౌన్ మే 3తో ముగియనున్న నేపథ్యంలో 4వ తేదీ నుంచి నూతన మార్గదర్శకాలను జారీ చేస్తామని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. గ్రీన్‌జోన్, ఆరెంజ్ జోన్‌ల ఆధారం జిల్లాల వారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. రెడ్ జోన్‌లలో మాత్రం మే 3 తర్వాత ఎలాంటి సడలింపులు ఉండవని బుధవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే.
అయితే దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా, ఏపీతో సహా మిగతా రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య మరింత పెరిగిపోతుండటంతో కేంద్రం మరింత అప్రమత్తమైంది. ఇక లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక పరిస్థితులతో పాటు సామాన్య ప్రజలు తవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వలస కూలీలకు సైతం తినేందుకు తిండిలేక నానా అవస్థలు పడుతున్నారు.
అయినా దేశంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తుండటంతో లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన ప్రధాని మోదీ.. ముఖ్యమంత్రుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఇక లాక్‌డౌన్ పొడిగించాలని కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోదీకి సూచించారు. కరోనాను పూర్తిస్థాయిలో అరికట్టాలంటే లాక్‌డౌన్ పొడిగించాల్సిందేనని మోదీతో తెలిపారు. దీంతో ప్రధాని మోదీ కూడా లాక్‌డౌన్ పొడిగించేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక లాక్‌డౌన్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఒక వేళ లాక్‌డౌన్ పొడిగించినా.. మే 4 తర్వాత కొన్ని సడలింపులు ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.