దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో 1823కేసులు న‌మోదు కాగా.. 67 మంది మ‌ర‌ణించారు. వీటితో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33,610కి చేరగా.. 1075 మంది మృత్యువాత ప‌డ్డారు.

దేశ‌వ్యాప్త లాక్‌డౌన్‌ను ఇప్ప‌టికే మే 3 వ‌ర‌కు పొడిగించిన సంగ‌తి తెలిసిందే. ఈ గ‌డువు తేదీ స‌మీపిస్తుండ‌డంతో ఇటీవ‌ల ప్ర‌ధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంతో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. లాక్‌డౌన్ పొడిగించాలా వ‌ద్దా అనే అంశంపై చ‌ర్చించారు. ఈ వారాంతంలో మరోసారి జాతినుద్దేశించి చేసే ప్రసంగంలో ప్ర‌ధాని లాక్‌డాన్ కొనసాగింపుపై కీలక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. ఈ తరుణంలో నిన్న‌ పంజాబ్ సీఎం రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించ‌గా.. నేడు ప‌శ్చిమ బెంగాల్ సీఎం కూడా లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

బెంగాల్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండ‌డంతో.. మ‌రోసారి లాక్‌డౌన్ పొడి‌గించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. మే చివరి వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇందుకు కొన్ని సడ‌లింపులు ఇవ్వ‌నున్న‌ట్లు పేర్కొంది. చిన్న దుకాణాలు, ఎంపిక చేసిన గ్రీన్ జోన్లలో వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *