కరోనా కారణంగా మానవ సంబంధాలు తెగిపోయాయి. గ్రామాల్లో ఉదయాన్నే పనులకెళ్లి..అలా సాయంత్రం అయితే చుట్టుపక్కల అమ్మలక్కలంతా ఓ చోట చేరి కాసేపు ముచ్చట్లాడి మళ్లీ ఎవరి పని వారు చూసుకుంటారు. మళ్లీ షరా మామూలే. కానీ లాక్ డౌన్ కారణంగా గ్రామాల్లో ఎవరూ బయటికి రావడం లేదు. నిజానికి సామాజిక దూరం పాటించడంలో పట్టణ వాసుల కన్నా గ్రామస్తులే మేలు. కానీ ఇప్పుడు ఈ లాక్ డౌన్ కారణంగానే అగ్రవర్గం దళితవర్గంపై అజమాయిషీ ప్రదర్శిస్తోంది.
కర్నూల్ జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలో అగ్రవర్గాల వారు కరోనా సాకు చూపి దళితులను గ్రామంలోకి రానివ్వకుండా ముళ్లకంచెలు అడ్డువేశారు. దీంతో కనీసం నిత్యావసరాలు తెచ్చుకునేందుకు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. చేసేది లేక దళితులంతా ఏకమై తమను గ్రామంలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వెంకటాపురం అగ్రవర్గాలపై చర్యలు తీసుకోవాలి, దళితులపై దాడిచేసిన అగ్రవర్ణాలు డౌన్ డౌన్ అని నినదించారు. ఈ విషయం తెలుసుకున్న ఆత్మకూరు డీఎస్పీ వెంకట్రావు గ్రామానికి వెళ్లి అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు. ఇరువర్గాల నుంచి వివరాలు తెలుసుకున్న ఆయన రెండు వర్గాల మధ్య రాజీ చేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.