లాక్‌డౌన్ నిబంధనలను సడలిస్తూ కేంద్రం ఉత్తర్వులు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 April 2020 9:26 AM ISTకరోనా మహమ్మారి విజృంభణ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో వస్తు, వ్యాపార సముదాయాలన్ని మూతపడ్డ విషయం తెలిసిందే. దీని కారణంగా జనాలు ఆర్థికంగా నష్టపోతున్నారు. అయితే గతకొన్ని రో్జులుగా లాక్‌డౌన్ సడలింపుపై వస్తున్న వార్తలను నిజం చేస్తూ.. కేంద్రం కొంతమేరకు లాక్‌డౌన్ నిబంధనలను సడలించింది.
ఈ మేరకు కేంద్రం గ్రామీణ, చిన్నపట్టణాల్లో షాపులు తెరిచేందుకు అనుమతిని ఇచ్చింది. లాక్‌డౌన్ నుంచి కొన్ని షాపులకు మినహాయింపు ఇస్తూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ శుక్రవారం అర్దరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మున్సిపల్ నివాస ప్రాంతాల్లో అక్కడక్కడా విడిగా ఉన్న షాపులను ముఖానికి మాస్క్ లు ధరించి.. షాపులలో సామాజిక దూరం పాటిస్తూ 50 శాతం సిబ్బందితో.. అవసరమైన జాగ్రత్తలు పాటిస్తూ తెరిచేందుకు కేంద్ర హోంశాఖ అనుమతించింది. ఇక కరోనా హాట్‌స్పాట్‌లు, కంటైనర్ జోన్‌లలో మాత్రం అన్ని దుకాణాలను మూసి ఉంచాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది.
అలాగే.. మున్సిపాలిటీల్లోని మార్కెట్ ప్రదేశాలు, మల్టీబ్రాండ్, సింగిల్ బ్రాండ్ మాల్స్ లలోని దుకాణాలు మాత్రం మే 3వతేదీ వరకు మూసివేయాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సంతకం చేసిన ఈ ఉత్తర్వులను శుక్రవారం అర్దరాత్రి విడుదల చేసింది.