జూన్‌ 16 తర్వాత భారత్‌లో మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్‌.. నిజమేనా..?

By సుభాష్  Published on  14 Jun 2020 11:42 AM IST
జూన్‌ 16 తర్వాత భారత్‌లో మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్‌.. నిజమేనా..?

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో ఉంది. రోజురోజుకు మృత్యుఘంటికలు మోగిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. కరోనా కట్టడి మాత్రం ఆగడం లేదు. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. అయితే కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక లాక్‌డౌన్‌కు ముందు ఉన్న కేసుల సంఖ్యను చూస్తుంటే గుండెల్లో దడపుట్టించేలా ఉంది. లాక్‌డౌన్‌కు ముందు కేసులు చాలా తక్కువగా ఉన్నా.. లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇవ్వడంతో ఒక్కసారిగా పాజిటివ్‌ కేసులు పెరిగిపోయాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది.

అయితే ఈ సారి విధించబోయే లాక్‌డౌన్‌ మరింత కఠినతరంగా ఉంటుందని, పలు షరతులతో కూడిన వ్యాపార కార్యకలాపాలు మాత్రమే కొనసాగుతాయని వార్తలు వస్తున్నాయి. దేశంలో ప్రతి రోజు 9వేల నుంచి 10 వేల వరకూ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా బాగానే పెరిగిపోయింది. కరోనా కేసుల్లో ప్రస్తుతం భారత్‌ నాలుగో దశలో ఉంది. ఇక దేశంలో కరోనా కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఇక పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని జూన్‌ 15 తర్వాత మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తారనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

లాక్‌డౌన్‌పై వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను కొట్టిపారేసింది. తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి వార్తులు పుట్టుకొస్తున్నాయని, సంపూర్ణ లాక్‌డౌన్‌ గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం అనంతరం తదుపరి నిర్ణయం తీసుకుంటమని పేర్కొంది. సోషల్‌ మీడియాలో వస్తున్నవార్తలను నమ్మవద్దని, లాక్‌డౌన్‌ గురించి తీసుకునే నిర్ణయం త్వరలో వెల్లడిస్తామని తెలిపింది.

కాగా, దేశంలోకరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శనివారం మోదీ, అమిత్‌ షాలు కేంద్ర మంత్రులతో సమావేశం జరిగింది. కరోనా కేసులు, లాక్‌డౌన్‌ అంశాలపై చర్చించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు , జాగ్రత్తల గురించి చర్చించారు. ఇక 16, 17తేదీల్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో కేసుల వివరాలు, లాక్‌డౌన్‌ మళ్లీ విధించాలా..?వద్దా.? అనే అంశాలపై ముఖ్యమంత్రుల నుంచి మోదీ సహాలు, సూచనలు తీసుకోనున్నారు. అపైనే తుది నిర్ణయం తీసుకోనుంది కేంద్రం.

Next Story