ఓ 'చిన్న' మాట.. ఈ మసీదు గొప్పేమిటో తెలుసా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Nov 2019 11:53 AM IST
ఓ చిన్న మాట.. ఈ మసీదు గొప్పేమిటో తెలుసా?

ఇది 'భారీ'ల రాజ్యం. తాడిని తన్నే వాడుంటే దాని తలదన్నేవాడుండే లోకం ఇది. ఎంత పెద్ద అయితే అంత గొప్ప. అందుకే ఒకడు పదంతస్తుల బిల్డింగ్ కడితే ఇంకొకడు పాతిక అంతస్తుల భవనం కడతాడు. అలనాటి నూటయాభై అడుగుల చార్మినార్ నేటి హైటెక్ సిటీ ముందు మరుగుజ్జు.

కానీ చిన్నగా ఉండి కూడా రికార్డులు బద్దలగొట్టొచ్చు. ఆరడుగుల ఇశాంత్ శర్మనైనా మరిచిపోతామేమో కానీ అయిదడుగుల సచిన్ పేరు క్రికెట్ ఉన్నంత కాలం ఉంటుంది. అలాంటి బుల్లి మసీదు కథ ఇది. ఇది ప్రపంచంలోనే అతి చిన్న మసీదు. పట్టుమని నూటపది చదరపు అడుగులు కూడా ఉండదు. 9.2 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు. అంతే..... అంత చిన్న మసీదు ఇది.

ఇంతకీ ఈ మసీదు ఎక్కడుందంటారా? ఇది అక్షరాలా మన హైదరాబాద్ లోనే ఉంది. అవునండీ... పాతబస్తీలోని మీరాలం చెరువు పక్కనే మీర్ మహ్మద్ కీ పహాడ్ అనే ఒక గుట్ట ఉంది. ఆ గుట్ట మీదే ఉంది మస్జిద్ మీర్ మహ్మద్ షా. ఇంతకీ ఈ మీర్ మహ్మద్ షా ఎవరనుకుంటున్నారా? ఈయన ఇరాన్ నుంచి హైదరాబాద్ కు కులీ కుతుబ్ షాల హయాంలో వచ్చిన ఒక సూఫీ ఫకీర్. ఈ కొండకీ, కొండ మీద ఉండే బుజ్జి మసీదుకి ఆయన పేరే పెట్టారు. ఒకే ఒక్క ప్రవేశ ద్వారం, రెండే రెండు మినార్లు, మూడే మూడు మెట్లు, నాలుగే నాలుగు గోడలతో కట్టిన ఈ మసీదులో అయిదే అయిదుగురు నమాజు చేయవచ్చు.

మస్జిద్ మీర్ మహ్మద్ షా తరువాత అతి చిన్న మసీదు భోపాల్ లో ఉంది. దీని పేరు ఢాయి సీఢీ కీ మసీద్ అంటే రెండున్నర అడుగుల మసీదు. ఇది పదిహేడో శతాబ్దంలో అఫ్గన్ పాలకుడు దోస్త్ మహ్మద్ గుర్తుగా కట్టించిన మసీదు. ఆ తరువాత మూడో స్థానంలో రష్యాలోని నాబరెజ్నెయి చెల్నే లోని మసీదు ఉంటుంది. అయితే ఏలూరులో ఇంకొక మసీదు ఉంది. బహుశః దాని కంటే చిన్న మసీదు ఇంకొకటి ఉండదేమో. ఇది మూడు ఫీట్ల పొడవు. అయిదు ఫీట్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. కానీ ఇందులో అయిదు సార్లు నమాజ్ జరగడం లేదు. అందుకే దీనిని మసీదుగా పరిగణించడం లేదు.

మొత్తం మీద స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అన్న మాటను ఈ చిట్టి పొట్టి చిన్నారి మసీదులు ఋజువు చేస్తున్నాయి. ఈ మసీదులు చిన్నవే కావచ్చు. కానీ చాలా పెద్ద చరిత్రను తమ గోడల్లో, మీనార్లలో దాచుకున్నాయి.

Next Story