గెస్ట్‌హౌస్‌లో అధికారుల మందుపార్టీ.. మీడియాను చూసి పరుగో పరుగు
By తోట వంశీ కుమార్
కరోనా వైరస్ మన దేశంలో రోజు రోజుకు విజృంభిస్తోంది. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి దేశ వ్యాప్త లాక్‌డౌన్ ను అమలు చేశారు. భౌతిక దూరంతోనే కరోనా కట్టడి చేయగలం అని వైద్యులతో పాటు అధికారులు ప్రజలకు చెబుతున్నారు. ప్రజలు కూడా విపత్తును గుర్తించి వ్యక్తిగత దూరం పాటిస్తున్నారు. లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన కొందరు అధికారులు నిబంధనలను గాలికి వదిలేశారు. రాత్రివేళ మద్యం, మాంసాహారంతో విందు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లా మధిరలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. విషయం తెలిసిన మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోవడంతో.. సదరు అధికారులు తలో ధిక్కుకు పరిగెత్తారు.
మండస్థాయి అధికారులు 8 మంది బృందం కరోనా వైరస్ పై ప్రజల్లో అవగాహాన కల్పిస్తున్నారు. ఉదయం ప్రజలకు అవగాహాన కల్పించిన ఈ అధికార బృందం సోమవారం రాత్రి నిబంధనలను గాలికి వదిలేసి ఎంచక్కా.. మండల అధికారి విశ్రాంతి భవనంలో చేరి మందు పార్టీ చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న మీడియా అక్కడికి చేరుకున్నారు. వీరిని చూసిన వెంటనే సదరు అధికారులు తలో దిక్కుకు పరిగెత్తారు. ఓ అధికారి ఏకంగా బాత్‌రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకోగా.. మిగతా అధికారులంతా గోడదూకి పారిపోయారు.
బాత్‌రూమ్‌లో ఉన్న అధికారి అరగంట దాటిన బయటికి రాలేదు. మీడియా బృందం తలుపు తట్టడంతో తప్పక ఎట్టకేలకు బయటకు వచ్చి పరుగు లంకించుకున్నాడు. ఈ అధికార బృందం తాగిన మద్యం సీసాలు, మాంసం, ఇతర ఆహార పదార్థాలు అక్కడే ఉన్నాయి. వంటగదిలో ఓ మూలన ఖరీదైన మద్యం సీసాలు కనిపించాయి. సమాచారాన్ని పోలీసులకు తెలియజేయగా.. అక్కడకు వచ్చి పరిశీలించారు.