త‌ల్లి ప్రేమ‌.. కొడుకు కోసం..1400కి.మీ స్కూటీపై ప్ర‌యాణం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 April 2020 4:10 PM GMT
త‌ల్లి ప్రేమ‌.. కొడుకు కోసం..1400కి.మీ స్కూటీపై ప్ర‌యాణం

త‌ల్లికి త‌న బిడ్డ‌పై ఎంత ప్రేమ ఉందో చాటి చెప్పే ఘ‌ట‌న ఇది. త‌న బిడ్డ వేరే రాష్ట్రంలో చిక్కుకున్నాడని తెలియ‌గానే ఆ త‌ల్లి విల‌విల‌లాడింది. అధికారులను క‌ల‌సి త‌న బాధ‌ను చెప్పుకుంది. అర్థం చేసుకున్న అధికారులు కావాల్సిన అనుమ‌తులు ఇచ్చారు. దీంతో ఆ త‌ల్లి స్కూటీపై వెళ్లి త‌న కొడుకును ఇంటికి తీసుకొచ్చుకుంది.

భోద‌న్‌కు చెందిన ర‌జియా బేగం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో టీచ‌ర్‌గా ప‌ని చేస్తోంది. ఆమెకు ఇద్ద‌రు కుమారులు, ఓ కుమారై. చిన్న‌వాడైన నిజాముద్దీన్ ఇంట‌ర్ పూర్తి చేసి హైద‌రాబాద్‌లోని నారాయ‌ణ మెడిక‌ల్ అకాడ‌మీలో శిక్ష‌ణ తీసుకుంటున్నాడు. కాగా.. ఇంట‌ర్‌లో నెల్లూరుకు చెందిన ఓ విద్యార్థితో అత‌నికి స్నేహాం ఏర్పడింది. ఇంట‌ర్ స‌ప్ల‌మెంట‌రీ ప‌రీక్ష‌ల కోసం ఇద్ద‌రు క‌ల‌సి బోధ‌న్ కు వ‌చ్చారు. కాగా.. స్నేహితుడి తండ్రి ఆరోగ్యం బాగా లేక‌పోవ‌డంతో స్నేహితుడితో క‌లిసి మార్చి 12న నెల్లూరుకి వెళ్లాడు.

ఇదే స‌మ‌యంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభించింది. క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌లో భాగంగా ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించింది. దీంతో నిజాముద్దీన్ నెల్లూరులో చిక్కుకుపోయాడు. అది తెలిసి ర‌జియాబేగం మ‌రింత ఆందోళ‌న‌కు గురైంది.

లాక్‌డౌన్‌ను ఇంకా పొడిగిస్తారు అనే వార్త‌ల నేప‌ధ్యంలో త‌న కొడుకును ఇంటికి తీసుకుని రావాల‌ని అనుకుంది. వెంట‌నే బోధన్‌ ఏసీపీ జైపాల్‌రెడ్డిని కలిసి పరిస్థితిని వివ‌రించింది. ఆయ‌న ఇచ్చిన లెట‌ర్ తీసుకుని స్కూటీపై సోమ‌వారం నెల్లూరుకు బ‌య‌లుదేరింది. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నానికి 700 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న నెల్లూరుకు చేరుకుంది. త‌న కొడుకును తీసుకుని బుధ‌వారం బ‌ధ‌వారం మ‌ధ్యాహ్నానికి కామారెడ్డికి చేరుకుంది. మొత్తం 1400 కిలో మీట‌ర్లు ప్ర‌యాణించి త‌న కుమారుడిని తీసుకొచ్చుకుంది.

ఈ సంద‌ర్భంగా ఆమె విలేక‌రుల‌తో మాట్లాడుతూ.. కొడ‌కును చూడాల‌నే తాను అంత దూరం ప్ర‌యాణించాన‌ని, అటవీ ప్రాంతం గుండా వెళ్లినా భ‌యం అనిపించ‌లేదంది. చాలా చోట్ల పోలీసులు ఆపార‌ని అయితే.. భోధ‌న్ ఏసీపీ ఇచ్చిన లెట‌ర్‌ను చూపించి త‌న కొడుకును క్షేమంగా ఇంటికి తీసుకురాగ‌లిగాన‌ని చెప్పింది. త‌న ప్ర‌యాణానికి స‌హ‌క‌రించిన పోలీసుల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పింది.

Next Story
Share it