కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తుండటంతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీంతో అన్ని షాపులతో పాటు మద్యం షాపులు సైతం మూతపడ్డాయి. ఇక షాపులు మూతపడటంతో ప్రభుత్వాలకు భారీగా ఆదాయం తగ్గిపోయింది. ఆదాయం కోసం ప్రభుత్వాలు మద్యం షాపులు తెరిచేందుకు ముందుకొచ్చాయి. ఇక మూడో దశ లాక్‌డౌన్‌ పొడిగించిన కేంద్రం.. కొన్నింటికి సడలింపులు ఇస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్రం. అనేక రాష్ట్రాల్లో కూడా మద్యం షాపులు తెరిచి మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతుండగా, భౌతిక దూరం పాటించకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ మద్యం ప్రియులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నియమ నిబంధనల మధ్య మద్యం అమ్మకాలు జరిపేందుకు ముందుకొచ్చింది. షాపులు తెరిచి మద్యం అమ్మకాలు జరపడం వల్ల జనాలు సామాజిక దూరం పాటించడం లేదని, దాంతో కరోనా వ్యాప్తి మరింత పెరిగే అవకాశాలున్నాయని ఆలోచించి హోం డెలివరీకి అనుమతి ఇచ్చింది.

ఆన్‌లైన్‌ ఆర్డర్‌ ద్వారా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకూ, అలాగే మధ్యాహ్నం 1 గంటల నుంచి 6 గంటల వరకూ డోర్‌ డెలివరీ చేయనున్నట్లు పంజాబ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి బుధవారం ప్రకటించారు. ముందుగా షాపులు తెరిచేందుకు సిద్ధం కాగా, వినియోగదారులు నిబంధనలు పాటించరనే ఉద్దేశంతో ఈ డోర్‌ డెలివరీకి అనుమతి ఇచ్చింది.

నిబంధనలు పాటించకపోతే లైసెన్స్‌లు రద్దు

మద్యం విషయంలో నిబంధనలు ఏ మాత్రం పాటించనట్లయితే వెంటనే షాపుల లైసెన్స్‌లు రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. చాలా ప్రాంతాల్లో సామాజిక దూరం పాటించడం లేదని, దీంతో కరోనా వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉన్నందున మద్యం డోర్‌ డెలివరీకి అనుమతిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది.

ఇక ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో కూడా ఆన్‌లైన్‌ ద్వారా మద్యం విక్రయాలు జరిపేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఛత్తీస్‌ గఢ్‌ స్టేట్‌ మార్కెటింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అనే యాప్‌ ద్వారా మద్యం ఆర్డర్‌ చేసుకోవచ్చు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.