ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్ 'యనా'
Yana is one of the best tourist places in India. కర్ణాటకలో ఉన్న బెస్ట్ టూరిస్ట్ ప్రదేశాలలో యనా ఒకటి. యనాలో అడుగుపెడితే చాలు
By అంజి Published on 1 Jan 2023 5:00 PM ISTకర్ణాటకలో ఉన్న బెస్ట్ టూరిస్ట్ ప్రదేశాలలో యనా ఒకటి. యనాలో అడుగుపెడితే చాలు ఒక పక్క జలపాతాలు, మరోపక్క వన్యప్రాణులు స్వాగతం చెబుతాయి. ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేయవచ్చు. ఉత్తర కన్నడ జిల్లాలోని సిర్సి, ,కుమ్తా అడవుల్లో ఉన్న యనా విలేజ్..ప్రకృతి అందాలకే కాదు పరిశుభ్రతలో కూడా ది బెస్ట్ ప్లేస్. కర్ణాటక మొత్తంలో అతి పరిశుభ్రమైన గ్రామం ఇది. అంతేనా, దేశం మొత్తంమీద పరిశుభ్రతలో యనాది రెండో స్థానం. ఈ ప్లేస్‌కు మరో ప్రత్యేకత... ప్రపంచంలోనే ఎక్కువ తేమ గలిగిన ప్రాంతం కావడం.
యనా గుహలు..
యనాలో రెండు ప్రత్యేకమైన రాతి గుట్టులు ఉన్నాయి. అందులోని భైరవేశ్వర శిఖర దాదాపు 390 అడుగుల ఎత్తున ఉంటుంది. మోహిని శిఖర 300 అడుగుల ఎత్తులో ఉంటుంది.ఈ రెండు రాతి గుట్టలు ఎవరో చెక్కినట్లు టవర్స్‌లా ఉంటాయి. సున్నపురాయి, జిప్సం, డోలమైట్ కలగలిపిన రాతి గుట్టలివి. భైరవేశ్వర శిఖర కింద ఆలయగుహ ఉంది. అక్కడే స్వయంభుగా వెలసిన శివలింగం ఉంది. ఈ లింగం పైనుంచి నీళ్లు కిందకి పడుతుంటాయి. ఆ దృశ్యం చూసేందుకు భక్తులు వస్తుంటారు ఇక్కడికి. ఈ ప్రాంతం భక్తులకే కాదు, ట్రెక్కర్స్‌కి అడ్వెంచర్స్ ఎక్స్పీరియోన్స్ ఇస్తుంది. ట్రెక్కింగ్ చేస్తూ కొండమీది నుంచి కిందికి పారుతున్న జలపాతాల్ని చూడొచ్చు.
పురాణ గాథ
పురాణాల ప్రకారం ఈ ప్రదేశానికి, భస్మాసురుడికి సంబంధం ఉంది. భస్మాసురుడు ఘోర తపస్సు చేసి శివుడి నుంచి వరం పొందాడు. ఆ వరమేంటంటే... భస్మాసురుడు ఎవరి తలమీద చేయి పెడితే వాళ్లు కాలి బూడిద అయిపోవాలని. అయితే ఆ వరాన్ని పరీక్షించడానికి వరమిచ్చిన శివుడి తలమీదే భస్మాసుర హస్తం పెట్టాలనుకుంటాడు. అందుకోసం శివుడి వెంట పడతాడు. దాంతో కలవరపడిన శివుడు.. విష్ణువు సాయం కోరతాడు. శివుడికి సాయం చేసేందుకు విష్ణువు మోహిని అవతారం ఎత్తుతాడు. మోహిని అందానికి ముగ్దుడైన భస్మాసురుడు 'నాతో నృత్యం చేయగలవా' అని సవాల్ విసురుతాడు. ఆ పోటీలో మోహిని నృత్యం చేస్తూ చేతిని తలపై పెట్టుకునే భంగిమ పెడుతుంది. వరం విషయం మర్చిపోయిన భస్మాసురుడు తన తలపై చెయ్యి పెట్టుకుని, కాలి బూడిదైపోతాడు. అప్పుడు మంటలు వ్యాపించి యాణలోని సున్నపు రాయి, రాతి శిలలు నల్లగా మారాయని చెబుతారు. ఆ నిర్మాణాల చుట్టూ నల్ల మట్టి, బూడిద ఉంటాయి. అవే రుజువులని భక్తులు నమ్ముతారు. ఇక్కడున్న భైరవేశ్వర శిఖరాన్ని 'శివుడి కొండ' అని, మోహిని శిఖరాన్ని 'మోహినీ కొండ' అని పిలుస్తారు. ఇక్కడ పార్వతీదేవి విగ్రహం, వినాయకుడి ఆలయం కూడా ఉన్నాయి.
యనా ఇలా వెళ్లాలి
రోడ్, ట్రైన్, ఫ్లైట్ ఎలాగయినా వెళ్లొచ్చు. రోడ్ అయితే సిర్సి నుంచి 50 కి.మీ. కుమ్తా నుంచైతే 30 కి.మీ ప్రయాణం చేయాలి. బెంగళూరు నుంచి లోకల్ బస్‌లోవెళ్లొచ్చు. ట్రైన్లో అయితే హుబ్లీ రైల్వే స్టేషన్ నుంచి కుమ్తా వెళ్లి అక్కడి నుంచి ట్యాక్సీ లేదా బస్‌లో గ్రామానికి చేరొచ్చు. యనా, మంగళూరు ఎయిర్ పోర్ట్ నుంచి 262 కిలోమీటర్లు, బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచైతే 463 కి.మీ. దూరం ఉంటుంది.