పూర్వం నుంచి గాడిద పాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా పసి పిల్లలకు తాగించడం వలన దగ్గు, దమ్ము, జలుబు వంటి సమస్యలు తరుచుగా రావని ఇప్పటికి చెబుతుంటారు. వీటిలోని పోషక గుణాలతో ఇటీవల కాలంలో గాడిద పాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది.
ఇతర జంతువుల పాల కంటే తల్లి పాలలోని పోషకాలన్నీ గాడిద పాలల్లో ఉంటాయట. 19వ శతాబ్దంలో ఆకలితో అలమటించే అనాథ శిశువుల కడుపు నింపడానికి గాడిద పాలను తాగించేవారట. వీటిలో కొవ్వు శాతం తక్కువగా విటమిన్ - డీ ఎక్కువగా లాక్టోస్ రూపంలో ఉంటుందట. దీని వల్ల సమతుల్యమైన క్యాల్షియం గ్రహించుకోవచ్చు.
యాంటీ మైక్రోబియాల్ లక్షణాలు అంటు వ్యాధుల వ్యాప్తిని తగ్గిస్తాయట. గాడిద పాలు నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేసే కణాలను ప్రభావితం చేస్తాయి. దీంతో రక్తనాళాలు వెడల్పుగా మారి రక్త ప్రవాహం మెరుగుపడుతోందట. ఫలితంగా బీపీ తగ్గడం, గుండెలో పేరకుపోయిన కొవ్వు కరగడం జరుగుతోంది. ఇమ్యూనిటీ పెంచే సైటోకైనిన్లను ప్రభావితం చేసే గుణం గాడిద పాలలోని ప్రోటీన్లకు ఉంటుందట. శరీరంలో గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గించి, ఇన్సులిన్ ను మెరుగుపరిచే గుణం ఉందని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది.