ఇంట్లో దేవుడికి పూజ చేసే సమయంలో చాలా మంది సువాసన వెదజల్లే అగరుబత్తీలను వెలిగిస్తుంటారు. అయితే దీని నుంచి వచ్చే పొగ, వాటి వాసనం పీల్చడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అగరుబత్తీలు ఊపిరితిత్తులకు స్లో పాయిజన్ లాంటిదని, రోజూ అగరు బత్తీల పొగను పీల్చడం వల్ల మెల్ల మెల్లగా అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
అగరుబత్తీల నుండి విడుదలయ్యే కాలుష్య కారకాలు కాలక్రమంలో ఊపిరితిత్తులను నాశనం చేస్తాయని, ఇది సిగరెట్ తాగిన దానితో సమానమని అంటున్నారు. అగరుబత్తీల పొగను పీల్చడం వల్ల అలర్జీ, ఆస్తమా ఉన్న వారికి, పిల్లలకు, పెద్దలకు తీవ్ర ముప్పు కలిగే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అగరుబత్తీల నుంచి వచ్చే పొగను పీల్చడం వల్ల తలనొప్పితో పాటు శ్వాసకోశ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం, చర్మ సమస్యలు వస్తాయని అమెరికన్ కాలేజీ ఆఫ్ అలర్జీ, ఆస్తమా అండ్ ఇమ్యునాలజీ హెచ్చరించింది. అగరుబత్తీలను కాల్చడం వల్ల విడుదల అయ్యే పొగతో హర్ట్ డిసీజ్‌ల మరణాలు, స్ట్రోక్ మరణాలు పెరుగుతున్నాయట.
అగరుబత్తీలు కాల్చడం వల్ల అనారోగ్య సమస్యలే కాదు.. కొన్ని సార్లు అగ్ని ప్రమాదాలకు కూడా కారణం అవుతాయి. అగరుబత్తీల నుంచి వచ్చే పొగ మనిషి డీఎన్ఏపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అగరుబత్తీల పొగ వల్ల సీఓపీడీ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఎక్కువ సేపు ఈ పొగ బారిన పడకుండా చూసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. అగరుబత్తీలను వెలిగించినప్పుడు కిటికీలు తెరిచి ఉంచడం, చిన్నపిల్లలు ఉంటే అగరుబత్తీలు వెలిగించకపోవడం, ఒకవేళ వెలిగించాల్సి వస్తే, పిల్లలను ఆ పొగకు దూరంగా ఉంచడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.