అలా కూర్చునే పని చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
చాలా మంది ఐటీ, ఇతర ఉద్యోగులు ఆఫీస్‌లో గంటల కొద్దీ సమయం అలా కూర్చునే పని చేస్తుంటారు.
By అంజి Published on 24 Oct 2024 10:08 AM ISTఅలా కూర్చునే పని చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
చాలా మంది ఐటీ, ఇతర ఉద్యోగులు ఆఫీస్‌లో గంటల కొద్దీ సమయం అలా కూర్చునే పని చేస్తుంటారు. ప్రాజెక్టులు, పూర్తి చేయాల్సిన పని ఎక్కువగా ఉండటం వల్ల ఒకసారి కూర్చుంటే మధ్‌యలో తినడానికి మాత్రమే కుర్చీ నుంచి లేస్తుంటారు. ఆఫీసులో కనీసం 7 నుంచి 9.30 గంటలు అలా పని చేయాల్సి ఉంటుంది. ఇలా అధిక సమయం కూర్చుని పని చేస్తుండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం పెరుగుతోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం వల్ల మెడ, మెడ వెనక కండరాలు, వెన్నెముకపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది. శారీరక చలనం తగ్గడం వల్ల రక్తప్రసరణ సరిగా జరగదు. ఫలితంగా ఊబకాయం, డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యల ముప్పు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని కోసం ఆఫీసులో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు తీసుకోండి
ఆఫీసులో ఎక్కువ సమయం కూర్చొని పని చేసేటప్పుడు మన సిటింగ్ పొజిషన్ కీలకం. కూర్చొని పని చేసేటప్పుడు వెన్నెముక మీద ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. మనం ముందుకు వంగి పని చేస్తుంటే.. వెన్నెముకపై ఒత్తిడి పెరిగి డిస్క్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే కూర్చొనే విధానం సరిగా ఉండేలా చూసుకోండి.
ఎక్కువ సేపు కూర్చొనే పని చేయడం వల్ల రక్తప్రసరణ వేగం తగ్గుతుంది. దీని వల్ల మెదడుకు అవసరమైన స్థాయిలో ఆక్సిజన్ అందదు. అందుకే ప్రతి 60 నిమిషాలకు ఒకసారి లేచి నడవడం, కాస్త విరామం తీసుకోవడం చేయాలి.
కుర్చీలో వంగి కూర్చోవడం మంచిదికాదు. మోకాలిని 90 డిగ్రీల కోణంలో ఉంచి, పాదాలు నేలకు ఆనేలా కూర్చోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కంప్యూటర్ స్క్రీన్ కంటి స్థాయి కంటే కాస్త దిగువగా ఉండేలా చూసుకోవాలి.
అలాగే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి కంప్యూటర్‌కు కనీసం 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్లు చూడటం ద్వారా కంటి అలసట తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది.