నేడు 'వరల్డ్ హార్ట్ డే'.. గుండెకు సంబంధించిన ఈ విషయాలు మీకు తెలుసా?
ఒకప్పుడు గుండెపోటు ముసలివాళ్లకే వస్తుందనుకునేవాళ్లం.. ఇప్పుడు గుండె సమస్యలకు వయస్సుతో సంబంధం లేకుండా పోయింది.
By అంజి Published on 29 Sept 2024 9:25 AM IST
నేడు 'వరల్డ్ హార్ట్ డే'.. గుండెకు సంబంధించిన ఈ విషయాలు మీకు తెలుసా?
ఒకప్పుడు గుండెపోటు ముసలివాళ్లకే వస్తుందనుకునేవాళ్లం.. ఇప్పుడు గుండె సమస్యలకు వయస్సుతో సంబంధం లేకుండా పోయింది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వ్యసనాలతో హార్ట్ ఎటాక్ ముప్పు పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 1.85 కోట్ల మంది గుండె జబ్బులతో ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా 25 నుంచి 45 ఏళ్ల మధ్యవారిలో గుండెపోటు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. గుండెపోటు రావడానికి ముందు కనిపించే లక్షణాలు తెలుసుకొని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ముప్పు నుంచి బయటపడొచ్చు. అందుకే ఈ సమస్యపై అందరికీ అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డేను నిర్వహిస్తున్నారు.
- ప్రస్తుతం ఏటా సెప్టెంబర్ 29న 'వరల్డ్ హార్ట్ డే' నిర్వహిస్తున్నాం.. కానీ, 2011కు ముందు వరల్డ్ హార్ట్ డేను సెప్టెంబర్ చివరి ఆదివారం నిర్వహించేవారు.
- గుండె రోజుకు లక్ష సార్లు కొట్టుకుంటుంది. అదే ఒక మనిషి 80 ఏళ్లు బతికితే.. అతని జీవితకాలంలో గుండె దాదాపు 3 బిలియన్ సార్లు కొట్టుకుంటుంది.
- స్త్రీ రోగుల ఛాతీపై చెవిని ఉంచి గుండె చప్పుడు వినడం సరికాదనే భావనతోనే ఫ్రెంచ్ సైంటిస్ట్ రెనే లానెక్ స్టెతస్కోప్‌ను కనుగొన్నారట.
- స్త్రీ ప్రెగ్నెంట్ అయిన నాలుగు వారాలకే గర్భంలో శిశువు గుండె కొట్టుకోవడం స్టార్ట్ అవుతుందట.
- వారాల్లో సోమవారం రోజున అధిక హార్ట్ ఎటాక్‌లు సంభవిస్తున్నాయట. అలాగే ఏడాది మొత్తంలో క్రిస్మస్ (డిసెంబర్ 25), డిసెంబర్ 26, న్యూఇయర్ (జనవరి 1) రోజుల్లోనే ఎక్కువ గుండెపోటు మరణాలు నమోదు అవుతున్నాయట.
- గుండెకు చోటు కల్పించడానికి ఎడమ ఊపిరితిత్తు, కుడి ఊపిరితిత్తు కంటే కొంచెం చిన్నగా ఉంటుంది.
- గుండెపోటు వచ్చే రిస్క్ పొగాకు మానేయడం వల్ల 50 శాతం, రోజువారి వ్యాయామం వల్ల 30 శాతం, ప్రతి రోజూ కూరగాయలు, పండ్లు తీసుకోవడం వల్ల 25 శాతం తగ్గుతుందట.